తిరుమల కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విక్రయానికి గ్రీన్ సిగ్నల్
తిరుమల కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విక్రయానికి గ్రీన్ సిగ్నల్
- భక్తులకు భారంగా మారిన గాజు సీసా బాటిల్స్
- బ్రాండెడ్ సంస్థల బాటిల్స్ కు త్వరలో అనుమతి
- వృధా బాటిల్స్ క్రషింగ్ యంత్రాల ఏర్పాటు
- యాత్రికుల సౌలభ్యం కోసం టీటీడీ నిర్ణయం
తిరుమల, (పీపుల్స్ మోటివేషన్):-
తిరుమల కొండపై యాత్రికుల సౌలభ్యం కోసం మళ్లీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ల విక్రయానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ యాజమాన్యం యోచిస్తోంది.
కొండపై ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్న నేపథ్యంలో కొంతమేరకు సడలింపు ఇవ్వాలని భావిస్తున్నారు. వేసవికాలం దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులందరికీ వారికి సౌకర్యవంతంగా తగిన తాగునీరును అందించే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధం లో కొంత వెసులుబాటు కల్పించాలని టిటిడి భావిస్తోంది. ఈ మేరకు కొన్ని ముఖ్యమైన సంస్థలకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ల ను తిరుమల కొండపై విక్రయించుకునేందుకు మళ్లీ అనుమతి మంజూరు చేయాలని యోచిస్తున్నారు.
బిస్లరీ, కిన్లే, ఆక్వా ఫినా, టాటా ప్లస్, తదితర బ్రాండెడ్ సంస్థలకు వారు విక్రయించే మినరల్ వాటర్ బాటిళ్లకు అనుమతినిస్తూ, దాంతో పాటుగా కొండపై పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏ సంస్థలైతే తాగి వాడి పడేసే వాటర్ ప్లాస్టిక్ బాటిల్లను అక్కడికక్కడే నాశనం చేసేలా క్రషింగ్ యంత్రాలను కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే బాటిల్స్ విక్రయ అనుమతులను కూడా మంజూరు చేయాలని షరతును విధించాలని భావిస్తున్నారు. ఈ క్రషింగ్ యంత్రాలను మెయింటెనెన్స్ కూడా సంబంధిత సంస్థలే చేపట్టేలా నిబంధనలు విధించనున్నారు. ఇప్పటికే తిరుమల కొండపై కాకుల మాను తిప్ప వద్ద తన్నులు కొద్దీ చెత్త పేరుకు పోతున్న నేపథ్యంలో వాటిని తరలించడానికి టీటీడీ ఒక పెద్ద ప్రణాళికను అమలు చేయాల్సి వస్తోంది. మళ్లీ ఈ వాటర్ ప్లాస్టిక్ బాటిల్లను ప్రవేశపెడితే అది మరో సమస్యాత్మకంగా తయారు కాకుండా ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం విధిస్తూ గత వైసిపి ప్రభుత్వంలో అధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ మిగిలిన అన్ని అవకాశాలను వదిలిపెట్టేసి కేవలం వాటర్ బాటిల్ల విషయంలో మాత్రమే గట్టిగా అమలు చేసింది. అది కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను నిషేధించి వాటి స్థానంలో వైసిపి నాయకులకు లోపాయికారిగా ప్రయోజనం చేకూర్చే లాగా గాజు సీసాల్లోనే తయారుచేసే వారికి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ గాజు వాటర్ బాటిల్లను తయారు చేసే అనుమతులను అప్పటి ప్రజా ప్రతినిధి బినామీ పేర్లతోనే టీటీడీ నుంచి అనుమతి పొందారు. అప్పటినుండి ఇప్పటివరకు తిరుమల కొండపై గాజు వాటర్ బాటిల్ల విక్రయం పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మరొకరికి అవకాశం లేకుండా వైసిపి పెద్దలు వాటర్ బాటిల్ల పేరుతో ఒక మాఫియాను నడుపుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ప్లాస్టిక్ వాడకాన్ని కొండపై నిషేధించదలిస్తే.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నే కాకుండా ప్లాస్టిక్ కవర్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు తగిలించే ప్లాస్టిక్ కవర్లు, దుకాణాల్లో విక్రయించే వస్తువులు, టీటీడీ వినియోగించే అనేక ప్లాస్టిక్ వస్తువులు, ఇలా అనేక వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేస్తే తప్ప ప్లాస్టిక్ నిషేధం అంశం సఫలీకృతం కాదు. కానీ కేవలం వైసీపీ పెద్దలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై నిషేధం విధిస్తూ కఠినంగా అమలు చేశారు. ఫలితంగా శ్రీవారి భక్తులు ప్రత్యామ్నాయం లేక గాజు వాటర్ బాటిల్లతో నానా కష్టాలు పడుతూ సమస్యలు ఎదుర్కొన్నారు.
• 750 మి.లీ.లకు రూ.50 వసూలు..
• గాజు సీసా తిరిగిస్తే 30 రూపాయలు వాపస్
తిరుమలలో దాహార్తిని తీర్చుకోవడంలో శ్రీవారి భక్తులకు నానా తిప్పలు తప్పడం లేదు. కాలు ష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తిరుమలలో 2020 సంక్రాంతి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. ఇదే సమయంలో అందుబాటులోకి తీసు కువచ్చిన గాజు సీసాల వినియోగం, వాటి ధరతో ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల సమ యంలో ఎడా పెడా ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగి స్తూనే నిబంధనల పేరుతో భక్తులపై భారం మోపడాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తుల అభిప్రాయాలు సేకరించి ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించిన నేపథ్యంలో అతిథిగృహాల్లో వాటర్ డిస్పెన్సర్లు, తిరు మల వ్యాప్తంగా జలప్రసాదాలు అందుబాటులో ఉంచామని గత ప్రభుత్వంలో తితిదే ప్రకటించింది. వాస్తవంగా కొన్ని అతిథి గృహాల్లో తాగునీరు అందుబా టులో ఉండటం లేదు. మరోవైపు మరోవై భక్తులు తమతో పాటు స్టీలు, రాగి తదితర సీసాలు తీసుకువస్తేనే నీటిని పట్టుకొనేందుకు వీలవుతుంది. ప్రత్యామ్నా యంగా అనుమతించిన గాజు సీసాలు కొనుగోళ్లతో భక్తుల జేబులకు చిల్లులు తోడు భారం తప్పడం లేదు. గాజు బాటిల్ కొనుగోలు చేయాలంటే ముందుగా రూ.50 చెల్లించాలి. ఖాళీ బాటిల్ అప్ప గిస్తే రూ.30 తిరిగిస్తారు. ఈ క్రమంలో రూ.20కే లీటరు కొనుగోలు చేసే భక్తుడు ప్రస్తుతం 750 ఎం. ఎల్.కు రూ.20 చెల్లించాల్సి వస్తోంది. అది కూడా ఏమాత్రం నాణ్యతలేని నీరే కావడం బాధాకరం. ఇదే నీటిని కింద తిరుపతిలో కేవలం 10 రూపాయలకే లభ్యం అవుతుండడం గమనార్హం. మరోవైపు గాజు బాటిళ్లను తీసుకెళ్లడం భక్తులకు కష్టతరంగా ఉంటోంది. క్యూలైన్, రద్దీ ప్రదేశంలో కిందపడి పగిలితే గాయపడే అవకాశం ఉంటోంది.
అంతేకాకుండా ఈ గాజు సీసా విక్రయాల ద్వారా కొండపై అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. హాకర్స్ మధ్య గొడవలు జరిగిన సందర్భంలో ఈ గాజు బాటిల్లని పగులు కొట్టి దాడులకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.
• కొండపై తాగునీటి కోసం
• రోజూ 25 వేల బాటిళ్లు అవసరం
శ్రీవారి దర్శనానికి రోజూ 60 వేల నుంచి లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు... ప్రస్తుతం తిరుమలకు సాధారణ రోజుల్లో 20 వేలు, రద్దీ సమయంలో 30 వేలవరకు నీటి బాటిళ్లు విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని దుకాణాలు, హోటళ్లలో భక్తులకు అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో భక్తులకు ఉచిత జలప్రసాదం అందిం చేందుకు రాజు వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 84 జల ప్రసాదాలు అందుబాటులో ఉండగా వీటిద్వారా ప్రతిరోజూ 4.5 లక్షల లీటర్ల తాగునీ టిని భక్తులకు అందిస్తున్నారు. అయితే వీటన్నింటినీ వినియోగించు కునేందుకు భక్తుడు బాటిళ్లను స్వయంగా తెచ్చుకోవాల్సి వస్తోంది.
దేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా అమలు కాని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ల నిషేధం కేవలం తిరుమలలోనే బలవంతంగా అమలు చేయాలని గత ప్రభుత్వంలో అధికారులు చూశారు. ప్రస్తుత పాలకమండలి ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని గమనించి భక్తులకు భారం తగ్గించాలని ప్రయత్నించారు. గాజు సీసా లలో కాకుండా టెట్రా ప్యాకెట్ల రూపంలో మినరల్ వాటర్ ను భక్తులకు అందించే విధంగా సంప్రదింపులు జరిపారు. అయితే ఈ టెట్రా ప్యాకెట్ల రూపంలో మినరల్ వాటర్ ప్యాకెట్ల తయారీ ఒక లీటర్ కు దాదాపు 45 రూపాయలు వ్యయం అవుతున్నట్లు తేలింది. మరి ఇంత భారం భక్తులపై పడడం మంచిది కాదని టెట్రా ప్యాకెట్ల విషయంలో వెనక్కు తగ్గారు. ఏది ఏమైనా.. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ల నిషేధం అమలు చేయడం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని పరిస్థితుల్లో కనీసం పాత పద్ధతిలో ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్స్ విక్రయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మంచిదనే ఉద్దేశంతో టీటీడీ ప్లాస్టిక్ నిషేధం పై పునరాలోచనలో భాగంగా ఈ విధమైన నిర్ణయం తీసుకుంటోంది.