ప్రతిరోజు యోగా... ఆరోగ్యానికి బాట
ప్రతిరోజు యోగా... ఆరోగ్యానికి బాట
బొబ్బిలి, తెర్లాం మండలాల్లో ర్యాలీలు
జిల్లా కేంద్రంలో యోగా స్ట్రీట్
ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యానికి రాచబాట వేయవచ్చునని పలువురు యోగా గురువులు పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము కూడా సిద్ధిస్తుందని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రజలను చైతన్యపరిచేందుకు మండలాల్లో ర్యాలీలు ప్రారంభమయ్యాయి. బొబ్బిలి, తెర్లా మండలాల్లో సోమవారం ఉదయం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి యోగా పై ప్రజలకు చైతన్యం కల్పించారు. జిల్లా కేంద్రం విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగ స్ట్రీట్ నిర్వహించారు.
బొబ్బిలిలో యోగా ప్రదర్శన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం యోగాసన కార్యక్రమము జరిగింది. యోగా గురువు ఎం.ఈశ్వర వరప్రసాద్ తమ శిష్య బృందంతో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం కోమటిపల్లి డాక్టర్ సిహెచ్. కనకలక్ష్మి, అదేవిధంగా శివడవలస హోమియోపతి డాక్టర్ ఎస్.సుహారిక, ఇతర డాక్టర్లు హాజరయ్యారు. యోగా ప్రదర్శన అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, తహసీల్దార్ తదితర మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు, ఉపాధి హామీ సిబ్బంది, పాఠశాలల వ్యాయామ సిబ్బంది, వివిధ రంగాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
తెర్లాంలో భారీ ర్యాలీ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెర్లాం మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించి, యోగాపై అవగాహన కల్పించారు. యోగా గొప్పదనాన్ని వివరిస్తూ నినాదాలు చేశారు. ఎంపిడిఓ కార్యాలయం నుంచి పాత ఆర్టీసీ బస్టాండ్ వరకూ ఈ ర్యాలీ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడిఓ నీలిమ, ఏవో వెంకటరమణ, ఇంచార్జి తాసిల్దార్ జీ.సత్యనారాయణ, ఇతర మండల కార్యాలయాల అధికారులు, సిబ్బంది, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, ఇతర వైద్యులు, ఆ శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు, ఉపాధి హామీ, సచివాలయాల సిబ్బంది, వీఆర్వోలు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో యోగా స్ట్రీట్
భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థల్లో యోగా ఒకటని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంతంలో యోగా స్ట్రీట్ ఏర్పాటు చేసి, యోగాసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కోట వరకు ర్యాలీ చేపట్టారు. ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల మహిళలు అధికంగా పాల్గొని యోగ ఔన్నత్యాన్ని చాటారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంద్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగా ఆవశ్యకతపై చైతన్యం కావాలన్నారు. నెల రోజులపాటు యోగా కార్యక్రమాలను వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క ప్రధాన ప్రాంతంలో రెండు రోజులు పాటు యోగ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేయనున్నామని తెలిపారు. యోగ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు యోగా అభ్యసించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. సులభతర రీతిలో, సునాయాసంగా యోగా చేయవచ్చని చెప్పారు. యోగాతో ఆరోగ్య పరిపుష్టి చెందుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏ పిడి కళ్యాణ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరావు,సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ఈఈ టి.రాయల్ బాబు, టిపిఆర్ఓ సింహాచలం,డిఈలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.