పిఎం – జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నాము
'పిఎం – జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నాము
• ‘పిఎం – జన్ మన్’లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము
• కుల గణన ద్వారా వివిధ కులాల జీవన పరిస్థితులు తెలుస్తాయి... అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది
• గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరు... దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు
• హిమాలయాలు ఎలా తలవంచవో... నరేంద్ర మోడీ ఎక్కడా తలవంచరు
• ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు
• ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎం., డిప్యూటీ సి.ఎం.ల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
‘హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో... గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఎక్కడా తలవంచరు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత మన ప్రధానమంత్రి గారిదే’ అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆదివారం ధిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎం., డిప్యూటీ సి.ఎం.ల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నడూ ఓట్లు వస్తాయా రావా అనేది ఆలోచన చేయలేదు. దేశ అభివృద్ధే లక్ష్యంగా కర్తవ్య నిర్వహణలో ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం ‘పి.ఎం – జన్ మన్’ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పి.వి.టి.జి.) ఉండే ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించగలుగుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే పి.ఎం. – జన్ మన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.555.61 కోట్ల నిధులతో 612.72 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తున్నాము. ఇవన్నీ పి.వి.టి.జి. ఆవాసాలను అనుసంధానించే రహదారులే. వీటి ద్వారా ఏడు జిల్లాల్లో 239 పి.వి.టి.జి. ఆవాసాలకు రహదారులు ఏర్పరచగలుగుతున్నాము.
• ఓట్లు కోసం చూస్తే...
239 ఆవాసాలకు రహదారులు మూలంగా సుమారు 50 వేల మందికి రోడ్డు సౌకర్యం వస్తుంది. వారు మనకు ఓట్లు వేస్తారా లేదా అనే ఆలోచన ఎక్కడా చేయలేదు మన గౌరవ ప్రధాన మంత్రి గారు. అదే మొత్తాన్ని ఓట్లు వస్తాయి అనే చోట వెచ్చించవచ్చు. ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ముందడుగు వేస్తున్నారు. ఆ స్ఫూర్తితోతోనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలియచేసింది. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారికి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ మూడు నెలలపాటు రాష్ట్రంలో పర్యటించి రూపొందించిన నివేదికను అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాము.
ఆపరేషన్ సిందూర్, అందుకు దారి తీసిన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఇటువంటి దశలో కూడా ప్రజల రక్షణతోపాటు వారి భవిష్యత్తు కోసం గౌరవ ప్రధానమంత్రి ఆలోచన చేశారు. కుల గణన చేపట్టడం అనేది ఎంతో అవసరం. దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు తెలుస్తాయి. వారికి జీవనోపాధుల మెరుగుదలకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఏ పథకాలు తీసుకురావాలో పాలన వర్గాలకు ఒక స్పష్టత వస్తుంది” అన్నారు.