బియ్యం కార్డు కావాలంటే పెళ్లి కార్డు తేవాలంట..
బియ్యం కార్డు కావాలంటే పెళ్లి కార్డు తేవాలంట..
- మార్పు చేర్పులకు సతాయింపులెన్నో పేరు తొలగించాలన్నా.. వయసు సరిదిద్దాలన్నా కష్టాలే..
- నిబంధనల కొర్రీలు.. సర్వర్ పనిచేయక తిప్పలు జనం న్యూస్- అమరావతి
- వాళ్లేమీ కొత్త కార్డులు అడగడం లేదు..
ఉన్న కార్డులోనే చిన్నచిన్న సవరణలు కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై పడే భారమేమీ ఉండదు. ఆధార్ ద్వారా.. ఓటీపీతో వెంటనే పూర్తి చేస్తే పేర్ల తొలగింపు లేదా జోడింపు వంటి సమస్య పరిష్కారమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారుల సమస్యల్లో 80% పైగా ఇవే. కానీ అధికారులు మాత్రం వివాహ ధ్రువీకరణ పత్రాలో, విడాకుల పత్రాలో కావాలంటూ సతాయిస్తున్నారు. వివాహ పత్రాలు అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా.. దరఖాస్తు చేయడానికి వెళ్తే అవి కావాల్సిందేనని సిబ్బంది అంటున్నారు. చనిపోయిన వారి పేర్లు తప్పితే.. ఇతరులకు కార్డుల నుంచి తమ పేరు తొలగించుకునే అవకాశం లేదు. ఇలాంటి సమస్యలు బోలెడు.. ఈ నెల 7వ తేదీ నుంచి 3,48,399 దరఖాస్తులు అందాయి. వాటిలో 75% పేర్ల జోడింపు కోరుతూ వచ్చినవే. కానీ దానికీ సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి సర్వర్ మొరాయింపు తోడైంది.
వివాహ ధ్రువీకరణ కావాల్సిందే
పేదల్లో చాలామందికి వివాహ ధ్రువీకరణ పత్రాలుండవు. కానీ కొత్తగా పెళ్లయినవారు బియ్యం కార్డులో కుటుంబ సభ్యుడి పేరు చేర్చాలంటే.. వివాహ ధ్రువీకరణ కావాలంటున్నారు. దీంతో వారు కొత్తగా పెళ్లికార్డులు ప్రింటు చేయించుకుని, వాటిని పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. పెళ్లయిన 60 రోజుల్లోగా అయితే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకు మించితే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. చాలామందికి పెళ్లయి ఎన్నో ఏళ్లు అవుతోంది. చలానాకు రూ.500.. కార్డు ప్రింటింగ్‌కు రూ.500, ఆపై ఖర్చులు రూ.3-4 వేల వరకు అవుతున్నాయి. దీనికితోడు విపరీతమైన జాప్యం అవుతోంది. ఈలోగా గడువు ముగుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఉండే కల్యాణ మిత్రలను వైకాపా హయాంలో తొలగించడంతో ఇక్కట్లు మొదలయ్యాయి.
వివాహ ధ్రువపత్రాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే వివాహ నమోదు నంబరు, ఫొటో ఇస్తేనే దరఖాస్తు అప్‌లోడ్ అవుతోంది.
కార్డులు విభజించుకోవాలంటే.. హౌస్ హోల్డ్ నంబరు అడుగుతోంది. కొత్తగా ఇంటి నంబర్లు ఇవ్వకపోవడంతో చాలామంది నమోదు చేయలేకపోతున్నారు.
పేరు తొలగించుకోవాలన్నా తిప్పలే
సరిహద్దు జిల్లాల్లోని ఆడపిల్లలు కొందరు పెళ్లయ్యాక పొరుగు రాష్ట్రాలకు వెళ్తుంటారు. అక్కడ కార్డులో పేరు చేర్చాలని అడిగితే ఏపీలోని కార్డులో పేరు తొలగించుకుని రావాలని చెబుతున్నారు. ఇక్కడ అడిగితే చనిపోయినవారి పేర్లే తొలగిస్తామని అంటున్నారు. దీంతో వారికి అక్కడ కార్డులో చోటు దొరకట్లేదు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
హౌస్‌హోల్డ్ డేటా పాతదే.. విభజన కుదరదు
వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల కార్డులను రద్దుచేశారు. వారంతా పేదలే అయినా పింఛన్లు, ఇతర పథకాలకూ దూరమయ్యారు. కొత్త కార్డులు ఇవ్వట్లేదు. కుటుంబ విభజన అవకాశం లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుతం రేషన్‌కార్డులు ఉన్నవారి కుటుంబాల్లోనే సభ్యుల విభజనకు అవకాశం ఇచ్చారు. కుటుంబ (హౌస్‌హోల్డ్ డేటా) విభజనకు కూడా Existing చేయాలని పలువురు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
వయసు మార్చాలన్నా కష్టమే
కొంతమందికి పిల్లల వయసు 6 ఉంటే.. కార్డుల్లో 60 అని పొరపాటుగా పడింది. ఇలాంటివారు ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర ప్రయోజనాలకూ దూరమయ్యారు. కొన్నిచోట్ల ఆడవారిని మగవారిగా, మగవారిని ఆడవారిగానూ నమోదుచేశారు. ఇప్పుడివి మార్చాలంటే కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఒంటరి మహిళలకు దక్కని ప్రభుత్వ ప్రయోజనాలు
50 ఏళ్లు పైబడిన వారు, పెళ్లయి పిల్లలు లేని వారే ఒంటరి మహిళల కింద దరఖాస్తు చేసేందుకు వీలుంటుంది. పిల్లలు ఉన్నా వారికి దూరంగా ఉంటున్న వారికి దరఖాస్తు చేసే అవకాశం ఉండడంలేదు. ఇలాంటి వారు పింఛను, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. భార్య, భర్త విడివిడిగా ఉంటున్నా వివాహ ధ్రువపత్రాలు కోరుతున్నారు. పత్రాల అవసరం లేకుండానే కార్డులిస్తామని ఇటీవల పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్ చెప్పారు. కానీ అమలు కావడం లేదు.
ఒక్కో దరఖాస్తుకు గంటకు పైనే
బియ్యం కార్డులకు దరఖాస్తు కోసం గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్తే.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వర్ పనిచేయట్లేదనే సమాధానం వస్తోంది. కొద్దిసేపు పనిచేసినా ఒక్కో దరఖాస్తు నింపడానికి గంట నుంచి గంటన్నర పడుతోంది. ఉదయం 10 గంటల ముందు.. సాయంత్రం 5 తర్వాతే సర్వర్ పనిచేస్తోంది. అప్పుడు ఉద్యోగులు ఉండరు. దీంతో కొన్నిచోట్ల వారిని బతిమాలుకుని దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. మొబైల్ ద్వారా ఈకేవైసీ చేయాలన్నా.. అదీ సరిగా పనిచేయడం లేదు. 10 రోజుల నుంచి సమస్య ఉన్నా పరిష్కారం మాత్రం చూపడం లేదు.