Health tips: ఈ తొక్కలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Health tips: ఈ తొక్కలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
నిమ్మకాయలు మనకు దాదాపుగా ప్రతి సీజన్‌లోనూ లభిస్తాయి. ఏడాది పొడవునా ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. నిమ్మకాయల నుంచి రసం తీసి అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. నిమ్మరసాన్ని పానీయాల్లో వేస్తుంటారు. అలాగే వంటల్లోనూ వాడుతారు. నిమ్మరసం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలోని వేడి తగ్గిపోతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కేవలం నిమ్మపండే కాదు, నిమ్మతొక్క కూడా మనకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం తీసిన తరువాత నిమ్మ తొక్కను పడేస్తారు. కానీ వాటితో అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నిమ్మతొక్కలను పలు విధాలుగా ఉపయోగించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది...
నిమ్మతొక్కలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సాగే గుణాన్ని పొందుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు పోతాయి. కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. నిమ్మ తొక్కలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మతొక్కలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు స్వల్ప మొత్తాల్లో ఉంటాయి. ఇవి రోగాలు దరి చేరకుండా చూస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..
నిమ్మ తొక్కలో ఫ్లేవనాయిడ్స్, డి-లైమోనీన్, సాల్వెస్టరాల్ క్యూ40 అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా, యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. నిమ్మతొక్కలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. నిమ్మతొక్కలో ఉండే ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు.
ఎముకల దృఢత్వానికి..
నిమ్మతొక్కలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఈ తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. నిమ్మతొక్కల్లో ఉండే విటమిన్ సి, క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా మార్చుతాయి. నిమ్మతొక్కలోని విటమిన్ సి ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. దీంతో వృద్ధాప్యంలోనూ ఎముకలు బలంగా ఉంటాయి. నిమ్మతొక్కలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. పేగుల్లో మలం సులభంగా కదిలేలా చేస్తుంది. నిమ్మతొక్కలలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇలా నిమ్మతొక్కలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని ఎలా తీసుకోవాలా.. అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిమ్మతొక్కలను ఎండ బెట్టి పొడి చేసి దాన్ని మీరు రోజూ తినే ఆహారాలపై చల్లి తీసుకోవచ్చు. లేదా నిమ్మతొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. దీంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.