స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు
స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు
సీఎం చంద్రబాబునాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
సీఎం సూచనల మేరకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గ, మండల విజన్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తామని స్పష్టం
ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందిస్తామని సీఎంకు మంత్రి దుర్గేష్ హామీ
సీఎం ప్రత్యేక చొరవ, ఆదరణ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం: స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గ, మండల విజన్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాన్ని(డీవీఏపీ యూనిట్) సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యాచరణ ప్రణాళికపై సీఎం చంద్రబాబునాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ పలు అంశాలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలను ప్రాతిపదికగా తీసుకొని క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని సీఎంకు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుతో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా క్షేత్రస్థాయి నుండి కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు చేయాలన్న సీఎం సూచనలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమమని మంత్రి అభివర్ణించారు. తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా రంగాలు ప్రధానమైనవని, ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గం పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమని సీఎం కు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. తమ దృష్టికి రాగానే సంబంధిత సమస్యలు పరిష్కరించి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని సీఎం చంద్రబాబునాయుడును మంత్రి దుర్గేష్ కోరారు.
యువత,, ఔత్సాహిక పారిశ్రామకి వేత్తలు విద్యార్థుల ద్వారా ప్రతిపాదించే నూతన ఆవిష్కరణలకు ఆర్థిక, సాంకేతిక చేయూతనిచ్చే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఇది ఏపీ యువతకు వరం అని మంత్రి దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా రాజానగరంలో 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. సీఎం ప్రత్యేక చొరవ, ఆదరణ వల్ల రాష్ట్రంలో, జిల్లాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేసేందుకు అవకాశముందన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రి దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్య ఉంటుందని అన్నారు. వాటన్నింటిని వెలికి తీయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరిస్తూనే అవకాశాలను అనువుగా మలుచుకోవాలని సూచించారు. గ్రామస్థాయి నుండే ఇన్నోవేటివ్ గా ఆలోచించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడదామని తెలిపారు. తమ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రణాళిక రూపొందించుకొని సమర్పిస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.