రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

5ఏళ్లలో సాధించలేని పెట్టుబడులు 11నెలల్లోనే సాధించాం!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

5ఏళ్లలో సాధించలేని పెట్టుబడులు 11నెలల్లోనే సాధించాం!

11నెలల్లో 9.5లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాలకు ఒప్పందం

పరిశ్రమలు ప్రారంభమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి

ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ... మరోవైపు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి

ఉపాధి కల్పన మంత్రుల కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్

అమరావతి: అయిదేళ్ల వైసిపి ప్రభుత్వంలో సాధించలేని పెట్టుబడులను చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 11నెలల్లో సాధించిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, ఉపాధి కల్పన మంత్రుల కమిటీ చైర్మన్ నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ అధ్యక్షతన 20లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 9.20లక్షల కోట్ల విలువైన 78భారీ పరిశ్రమలు, 13,895 కోట్ల విలువైన 1,19,580 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 8.5లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో భారీపెట్టుబడులు, అత్యధిక ఉద్యోగాల కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎన్ టిసిపి, బిపిసిఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలకు పరిశ్రమలవారీగా ఈడిబిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పిఎంయు)లను ఏర్పాటుచేసి, పరిశ్రమ స్థాపించేవరకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. 

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి భూమితోపాటు ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని అన్నారు. అతిపెద్ద తీరప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో పర్యాటకరంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, బీచ్ టూరిజం అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. విశాఖలో ఒబెరాయ్, వరణ్ బీచ్ శాండ్స్ వంటి స్టార్ హోటళ్ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులతోపాటు ప్రభుత్వపరంగా పవర్, వాటర్ వంటి సదుపాయాలను సమకూర్చాలని అన్నారు. రాష్ట్రంలో బీచ్ శ్యాండ్, కోల్ గ్యాసిఫికేషన్ మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అన్వేషించాలని అన్నారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను సమకూర్చేందుకు యువతకు నైపుణ్యశిక్షణ అందించాలని, స్కిల్ ఎకోసిస్టమ్ కల్పించాలని అన్నారు. బిసిసిఐ సహకారంతో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, దీనిద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ తో అనుసంధానం చేయాలని అన్నారు. 

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ)ల ద్వారా ఎక్కువమందికి ఉపాధి లభించే అవకాశమున్నందున ఆ పరిశ్రమలకు పెట్టుబడుల మద్దతు కోసం పిఎంఇజిపి (Prime Minister's Employment Generation Programme) తో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబుగారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణతోపాటు మరోవైపు ఆయా ప్రాజెక్టుల ప్రారంభానికి వేగవంతంగా చర్యలు చేపటాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నామని, వివిధరంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగూరి నారాయణ, కందుల దుర్గేష్, టిజి భరత్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సిఇఓ సాయికాంత్ వర్మ, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఎపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, NREDCAP విసి అండ్ ఎండి కమలాకర్ బాబు, గనులశాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments

-Advertisement-