దంపతులు ఒకే చోట పనిచేసేలా వెసులుబాటు
దంపతులు ఒకే చోట పనిచేసేలా వెసులుబాటు
వైద్య సిబ్బంది బదిలీలు, కౌన్సిలింగ్‌పై కార్యాచరణ సూత్రాలు
వైద్యారోగ్య శాఖలో సాధారణ బదిలీ ప్రక్రియలో ఐచ్ఛిక స్థానాల ప్రాధాన్యతలు తెలియజేసే గడువు నేటితో (బుధవారం) ముగిసినందున తదుపరి కౌన్సిలింగ్ తో పాటు బదిలీలు చేపట్టాల్సిన ప్రక్రియపై మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబు అందరు విభాగాధిపతులతో బుధవారంనాడు రెండు గంటల పాటు చర్చించి రూపొందించిన కార్యాచరణ సూత్రాలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదించారు.
జిల్లా స్థాయి నుంచి విభాగాధిపతుల వరకు ఈ బదిలీ ప్రక్రియలో పాల్గొనే అధికారులంతా ఒకే స్పష్టమైన అవగాహనతో బదిలీలపై ఆయా స్థాయిల్లో పారదర్శకంగా, సహేతుకమైన నిర్ణయాల్ని తీసుకునేందుకు ఈ సూచనల్ని రూపొందించారు.
బుధవారంనాడు రూపొందించిన కార్యాచరణ సూచనలు
1) ప్రస్తుతం ఒకే చోట పనిచేస్తున్న దంపతుల్లో ఒకరైనా అదే చోట ఐదేళ్లలోపు పనిచేసి ఉంటే వారిని అదే చోట కొనసాగించవచ్చు
2) బదిలీల నిర్ణయాల్లో మొదట ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన వారి బదిలీ స్థానాలపై నిర్ణయాన్ని తీసుకోవాలి
3) ఆ తరువాత 2 నుండి ఐదేళ్లలోపు ఒకే చోట పనిచేసిన వారి బదిలీలపై వారి ఐచ్ఛికాల్ని బట్టి కొత్త స్థానాలపై నిర్ణయాలు తీసుకోవాలి
4) ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి వారు సూచించిన స్థానాల్లో పోస్టింగ్ లభించకపోతే వారికి కౌన్సిలింగ్ చేపట్టాలి
5) 2 నుండి ఐదేళ్ల లోపు ఒకే చోట పనిచేసి, వారు కోరుకున్న చోట బదిలీ దొరకకపోతే వారిని ప్రస్తుత స్థానాల్లో కొనసాగించాలి
6) కాంట్రాక్టు నియామకాలతో రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగుతారు. ఆ రెగ్యులర్ స్థానాలు ఖాళీలుగా పరిగణించబడవు
ప్రకటించని ఖాళీ స్థానాలు
వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో ప్రస్తుత సాధారణ బదిలీల నిమిత్తం ప్రకటించని ఖాళీల గురించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబు వాకబు చేశారు. ఇందుకు స్పందిస్తూ విభాగాధిపతులు (హెచ్వోడీలు) తెలిపిన వివరాలు
1) వైద్య కళాశాలల్లో జాతీయ వైద్య సంఘం( ఎన్ ఎంసి) నిబంధనల మేరకు వైద్య అధ్యాపకులను కొనసాగించేందుకు కొన్ని ఖాళీలను చూపలేదు
2) పిపిపి విధానంలో నిర్వహించాల్సిన వైద్య కళాశాలల్లో గతంలో నియమించిన వారిని రీడిప్లాయ్‌మెంట్ చేయాల్సిన అవసరాల దృష్ట్యా మరికొన్ని ఖాళీలను ప్రకటించలేదు
ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన దాదాపు అందరికీ కొత్త స్థానాల్లో బదిలీ చేసే వీలుంటుందని, అలా కుదరని కొన్ని సందర్భాల్లో తగు కారణాల్ని పరిశీలించి నిర్ణయాన్ని తీసుకుంటామని కృష్ణబాబు తెలిపారు.