యోగాభ్యాసంతో మానసిక వికాసం
యోగాభ్యాసంతో మానసిక వికాసం
- ప్రతిఒక్కరూ యోగాంధ్రను సద్వినియోగం చేసుకోవాలి
- యోగాసనాలను ఆచరిస్తూ ఆరోగ్య ఆంధ్రలో భాగస్వాములుకావాలి
- ఈ నెల 8న హరిత బెరం పార్కులో ప్రత్యేక యోగాసనాల కార్యక్రమం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాభ్యాసంతో మానసిక వికాసం సొంతమవుతుందని.. ప్రతిఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల్లో పాల్గొని యోగాసనాల సాధనను నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్ సరళ యోగాను రోజూ ఆచరిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చని.. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగంచేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని.. ఇందులో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లాలో ఇప్పటికే గాంధీ హిల్, పవిత్ర సంగమం పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ నెల 8వ తేదీ ఆదివారం కృష్ణానదీ తీరంలోని బెరం పార్కులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో 18వ రోజు కార్యక్రమం:
జిల్లాలో కనీసం పది లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్దఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్‌లో ఆయుష్, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం 18వ రోజు యోగాసనాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. యోగా ఔత్సాహికులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అర్బన్ పీహెచ్‌సీల వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని, డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డా. జె.సుమన్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్, ఆయుష్ అధికారి డా. రామత్లేహి, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు, శిరీష తదితరులు పాల్గొన్నారు.