ఏ బిడ్డకైనా తల్లిపాలే ప్రాణం
ఏ బిడ్డకైనా తల్లిపాలే ప్రాణం
- ఆర్.ఎం.ఓ డాక్టర్ హేమలత
- మిగులు పాలు ఉన్న తల్లులు ఆలోచించాలని వినతి
- మదర్ మిల్క్ బ్యాంక్ పై విస్తృత అవగాహన
రాప్తాడు, జూన్ 3:
సృష్టిలో తల్లిపాలు అమృతంతో సమానమని, ఏ బిడ్డకైనా ప్రాణమని అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆర్.ఎం.ఓ డాక్టర్ జి.హేమలత అన్నారు. రాప్తాడులోని ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై.. మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ చొరవ, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సహకారంతో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. తల్లిపాలు అందక ఏ బిడ్డ చనిపోకూడదన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామని వివరించారు. మిగులు పాలు లేదా అదనపు పాలు కలిగిన తల్లులు తమ పాలు మరో బిడ్డకు ప్రాణం పోస్తుందనే విషయాన్ని గుర్తించి మిల్క్ బ్యాంక్ లో అందించి సహకరించాలని డాక్టర్ హేమలత కోరారు. ఆ విధంగా సేకరించిన పాలను భద్రపరచి, పాలు లేని బిడ్డలకు అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లులు లేని అనాథ శిశువులకు అందించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుతామని హమీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి తల్లి సద్వినియోగం చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులపై ఉందని హేమలత అన్నారు. కార్యక్రమంలో న్యూట్రీషనిస్ట్ పల్లవి, మదర్స్ మిల్క్ బ్యాంక్ కౌన్సిలర్ రాధ, రాప్తాడు పీ.హెచ్.సీ డాక్టర్ శంకర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్, పాల్గొన్నారు.