చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ వేగంగా చేపట్టాలి
చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ వేగంగా చేపట్టాలి
- కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, జూన్ 03 :
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమం, ప్రజా పంపిణీ వ్యవస్థ, హౌసింగ్, ఎన్ఆర్ఈజీఎస్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆయా శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల అధికారులు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండలాల వారిగా యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేపట్టాలని, యోగా ట్రైనర్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. యోగాంధ్ర కాంపిటీషన్స్ విస్తృతంగా నిర్వహించాలని, గ్రామస్థాయిలో కాంపిటీషన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే నాలుగు రోజులకు సంబంధించి కాంపిటీషన్స్ షెడ్యూల్ తయారు చేయాలని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు షెడ్యూల్ ప్రకారం మండల స్థాయి కాంపిటీషన్స్ నిర్వహించాలన్నారు. ఆయా మండలాల్లో గ్రామస్థాయి కాంపిటీషన్స్ ఎక్కడ బాగా చేయలేదో దృష్టి పెట్టి వాటిని పూర్తిచేయాలని, యోగా ట్రైనర్స్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు కాంపిటీషన్స్ ని తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలని అధికారులని ఆదేశించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ఇప్పటివరకు జిల్లాలో 51 శాతం పూర్తి అయిందని, సరుకుల పంపిణీని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని కంబదూరు మండలంలో 32.93 శాతం మాత్రమే సరకుల పంపిణీ పూర్తయిందని, వెనుకబడిన మండలాలలో అత్యవసరాల పంపిణీలో వేగం పెంచాలన్నారు. జిల్లాలో 182 షాపులలో ఎలాంటి లావాదేవీలు జరగలేదని, మండల తహసిల్దార్లు, సీఎస్డీటీలు తనిఖీ చేసి వాటిలో లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అని, అన్ని చౌక దుకాణాలకు వెంటనే సరుకులు వెళ్లాలని, ప్రతినెలా ఒకటో తేదీ నాటికి ప్రతి చౌక దుకాణాలకు సరుకులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులు, మంచానికి పరిమితమైన కార్డుదారులకు ఇంటి వద్దనే సరుకులు అందించాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి గంటకొకసారి నివేదిక అందించాలని ఆదేశించారు. హౌసింగ్ పరిధిలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత సోక్ పిట్లు పూర్తి చేయడంపై శ్రద్ధ వహించాలని, డైలీ లేబర్ టర్నవుట్ మరింత పెంచాలన్నారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ కింద 1.50 లక్షల మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో 2,354 ఫారంపాండ్లు పూర్తి చేయడం జరగగా, వాటి పరిధిలో 37 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థలలో 100 మొక్కలు చొప్పున నాటేలా చూడాలని, ప్రతి మండలంలో 5,000 మొక్కలు నాటేలా కార్యచరణ ప్రణాళిక ఉండాలన్నారు. ప్లాంటేషన్ ముఖ్యమైన కార్యక్రమమని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ప్రోటోకాల్ పాటించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, హౌసింగ్ పిడి శైలజ, జిల్లా టూరిజం అధికారి జయ కుమార్ బాబు, డ్వామా పిడి సలీం భాష, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి వినోద్, జిజిహెచ్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, జి.ఎస్.డబ్ల్యు,ఎస్ కోఆర్డినేటర్ ధనుంజయ్, డిఆర్డిఏ పిడి శైలజ, ఆయుష్ అధికారులు డా.భాస్కర్, డా.లాల్యా నాయక్, యోగా గురువు కృష్ణవేణి పాల్గొన్నారు.