పెట్టుబడులకు ఏపీ అనుకూలం
పెట్టుబడులకు ఏపీ అనుకూలం
— రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
- ఏపీలో పెట్టుబడులకు ‘కిటెక్స్ గార్మెంట్’ ఆసక్తి
- త్వరలోనే సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ
- ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతం
- 10 నెలల కాలంలోనే రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడుల రాక
- కేరళలోని కంపెనీ ప్రధాన కార్యాలయం సందర్శన
- సంస్థ నిర్వహణపై మంత్రి సవిత ప్రశంసలు
అమరావతి : టైక్స్ టైల్స్ రంగంలో ప్రపంచ శ్రేణి దిగ్గజ కంపెనీ కిటెక్స్ గార్మెంట్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతో కంపెనీ యాజమాన్యం భేటీ కానుందని వెల్లడించారు. కేరళలోని కొచ్చిలో ఉన్న కిటెక్స్ గార్మెంట్స్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి సవిత శనివారం సందర్శించారు. అక్కడ తయారవుతున్న దుస్తులను పరిశీలించి, ఉద్యోగులతోనూ మాట్లాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిటెక్ గార్మెంట్స్ చైర్మన్ సాబు జాకబ్ తో కలిసి మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరవాత ఆంధ్ర్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గంగా మారిందన్నారు. కేవలం పది నెలల కాలంలో రూ.9.70 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి తరలొచ్చాయన్నారు. పీఎం నరేంద్రమోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలిస్తోందన్నారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు, విద్యుత్, నీటి సౌకర్యం సహా అన్ని మౌలిక వసతులు కల్పనకు తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ముఖ్యంగా ఏపీలో టెక్స్ టైల్ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇటీవలే నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కేరళలలో పెట్టుబడుదారులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా కిటెక్స్ యాజమాన్యంతో భేటీ అయినట్లు మంత్రి సవిత వెల్లడించారు. సత్యసాయి జిల్లాలో కిటెక్స్ గార్మెంట్స్ ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు సమీపంలో బెంగుళూరు విమానాశ్రయంతో పాటు కృష్ణపట్నం పోర్టు, రైల్వే కనెక్టవిటీ కూడా ఉందని, దీనివల్ల ఉత్పత్తుల ఎగుమతులు ఎంతో అవకాశముందన్నారు. కర్నూల్ లో పత్తి ఎక్కువగా ఉత్పత్తవుతోందని, కిటెక్స్ గార్మెంట్స్ కావాల్సిన రా మెటీరియల్ అక్కడి నుంచే సరఫరా చేయొచ్చునని మంత్రి సవిత వెల్లడించారు.
కిటెక్స్ నిర్వహణ భేష్
కిటెక్స్ గార్మెంట్ నిర్వహణపై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తంచేశారు. లాభార్జనతో కాకుండా నైతిక విలువలతో వ్యాపార నిర్వహణ చేస్తోందన్నారు. 15 వేల మంది ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా గౌరవిస్తుండడంపై కిటెక్స్ యాజమాన్యాన్ని కొనియడారు. టెక్స్ టైల్స్ రంగంలో కేరళలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థగా నిలిచిందన్నారు. దుస్తుల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా కిటెక్స్ గుర్తింపు పొందిందన్నారు. ఇటీవలే తెలంగాణాలో కిటెక్స్ రూ.3,600 కోట్లు పెట్టుబడులు పెట్టిందని మంత్రి సవిత వెల్లడించారు.
ఏపీలో కిటెక్స్ పెట్టుబడులపై హర్షం
ఏపీలోనూ కిటెక్స్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేస్తూ, సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో సీఎం చంద్రబాబుతో భేటీకి ఏర్పాటు చేస్తామన్నారు. సీఎంతో భేటీలో తమ పెట్టుబడి ప్రణాళికలను కిటెక్స్ యాజమాన్యం వివరించనుందన్నారు. ప్రపంచ శ్రేణి సంస్థ కిటెక్స్ గార్మెంట్స్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
అంతకుముందు మంత్రి సవిత కిటెక్స్ గార్మెంట్స్ ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆమెతో పాటు ఆ సంస్థ ఎండీ సాబు జాకబ్, ఇతర సిబ్బంది ఉన్నారు.