యోగాతో శ్రమ జీవులు మమేకం
యోగాతో శ్రమ జీవులు మమేకం
- వేలాదిమంది ఉపాధి వేతనదారులతో భారీ ప్రదర్శన
- చిరుజల్లుల మధ్యే పూర్తయిన యోగాంధ్ర రాష్ట్ర కార్యక్రమం
- ప్రతీఒక్కరికీ ఆరోగ్యం-యోగాంధ్ర లక్ష్యం
- జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఎస్.కోట, (విజయనగరం), జూన్ 10
పలుగు, పార పట్టుకొని మట్టిని తవ్వే ఆ శ్రమ జీవుల చేతులు యోగా కోసం పైకి లేచాయి. నిత్యం భూమిని నమ్ముకొని కాయకష్టం చేసే ఆ దేహాలు నేలపై కూర్చొని యోగాసనాలతో చైతన్యవంతమయ్యాయి. వారి ఉఛ్వాస నిశ్వాసాలు ఓంకార నాదంతో ప్రతిధ్వనించాయి. ఓవైపు చిరుజల్లులు కురుస్తున్నా..మొక్కవోని దీక్షతో వారంతా యోగా ప్రదర్శనను దిగ్విజయంగా పూర్తి చేశారు. వేలాదిమంది ఉపాధిహామీ వేతనదారులు యోగాంధ్ర కార్యక్రమానికి హాజరై, కొద్దిరోజుల్లోనే తాము నేర్చుకున్న యోగవిద్యను ప్రదర్శించారు. జిల్లా యంత్రాంగం గ్రామగ్రామానా క్షేత్రస్థాయిలో ఇచ్చిన శిక్షణ అద్భుత ఫలితాన్నిచ్చింది.*
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం వేతనదారులతో జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. సుమారు 5 వేల మందికి పైగా వేతనదారులు ఎస్.కోట మండలం చినఖండేపల్లి గ్రామ పరిధిలోని సాయి దివ్యామృతం ఆశ్రమంలో మంగళవారం ఉదయం యోగా ప్రదర్శన నిర్వహించారు. చిరుజల్లులు కురిసినప్పటికీ, క్రమశిక్షణతో ప్రదర్శనను నిరాటంకంగా పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ప్రతీఒక్కరికీ ఆరోగ్యాన్ని అందించాలన్న గొప్ప ఆశయంతో మన ముఖ్యమంత్రి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధించడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. మే 21న ప్రారంభించిన ఈ కార్యక్రమం జూన్ 21తో ముగుస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో శిక్షణ, యోగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. పర్యాటక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాల్లో కూడా యోగా ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా విస్తృత ప్రచారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. యోగాతో చక్కని ఆరోగ్యాన్ని సాధించవచ్చునని సూచించారు. యోగాభ్యాసాలు నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎస్.కోట ఎంఎల్ఏ కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, ప్రస్తుత మన నిత్య జీవితంలో ప్రతీఒక్కరూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటినుంచి ఉపశమనం పొందేందుకు, శారీక, మానసిక ఆరోగ్యాన్ని సాధించేందుకు యోగా దోహదపడుతుందని చెప్పారు. మన ఆరోగ్యం, దైనందిన జీవితం బాగుండాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని, ముఖ్యమంత్రి హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
డిసిఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ, శారీక మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేందుకు యోగా దోహదపడుతుందని అన్నారు. కొద్దిరోజులపాటు చేసి వదిలేయకుండా, యోగాను నిత్యం సాధన చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, ఎంపిపి ఎస్.సోమేశ్వర్రావు, వైస్ ఎంపిపి, టూరిజం డైరెక్టర్ సుబ్బలక్ష్మి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విశ్రాంత వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడు, సాయి దివ్యామృతం ఆశ్రమ బాబా సాయి, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, డ్వామా పిడి ఎస్.శారదాదేవి, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా టూరిజం అధికారి కుమారస్వామి, ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు, జెడ్‌పి సిఈఓ బివి సత్యనారాయణ, డిపిఓ టి.వెంకటేశ్వర్రావు, గృహనిర్మాణ శాఖాధికారి మురళీమోహన్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేష్, పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.