రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటాసెంటర్స్ రంగాల్లో 10లక్షల ఉద్యోగాలు లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటాసెంటర్స్ రంగాల్లో 10లక్షల ఉద్యోగాలు లక్ష్యం

  • వేగవంతంగా కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
  • త్వరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రీజనల్ స్పోక్స్ సెంటర్లు
  • మరింత సులభతరంగా మనమిత్ర సేవలు అందేలా చూడండి
  • ఐటి, ఎలక్ట్రానిక్స్, జిసిసి, డాటా సెంటర్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

అమరావతి: రాబోయే నాలుగేళ్లలో ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జిసిసి) ద్వారా 10లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజిఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జిసిసి), డాటాసెంటర్ల ఏర్పాటుకు ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు లక్షకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఆ సంస్థలు త్వరితగతిన తమ యూనిట్లను ఏర్పాటుచేయడానికి అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మక సంస్థలైన టిసిఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇటీవల తమ బెంగుళూరు పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జిసిసి)ల ఏర్పాటుకు ఎఎన్ఎస్ఆర్, సత్వ సంస్థలు ఎంఓయులు కుదుర్చుకున్నాయని, ఈ రెండింటి ద్వారానే యువతకు 35వేల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ఎంఓయులు చేసుకున్న సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కో వర్కింగ్ స్పేస్ సిద్ధం చేయాలని సూచించారు. 


త్వరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలు, స్టార్టప్ ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. దీంతోపాటే విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టిసిఎస్, ఎల్ అండ్ టి, ఐబిఎంల భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటైందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 400 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన డ్రోన్ సిటీని ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన ఎకో సిస్టమ్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు వరదల సమయంలో డ్రోన్లసేవలు ఎంతగానో ఉపకరించాయని, వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణం తదితర శాఖల్లో డ్రోన్ల వినియోగంపై నెలకో జిల్లాలో ఈవెంట్లు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. 

మనమిత్ర సేవలు విస్తృతపర్చండి

పౌరసేవల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృత ప్రచాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మొత్తం 702 సేవలకు 535 సేవలను ఇప్పటికే మనమిత్ర ద్వారా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి చెక్ పెట్టాలని, కులధృవీకరణ పత్రంతో సహా విద్యాసంబంధిత అన్నిరకాల సర్టిఫికెట్లు బ్లాక్ చైన్ తో అనుసంధానం చేసి మనమిత్ర ద్వారా సులభతరంగా పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని 45వేల ప్రభుత్వపాఠశాలల్లో ప్రతిస్కూలుకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ఎయిర్ పోర్టుల్లో అంతరాయం లేని ఫోన్ కనెక్టివిటీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఐటి అండ్ సి స్పెషల్ సెక్రటరీ సుందర్ ఎపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సిఇఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజిఎస్ సిఓ ప్రకార్ జైన్, ఎపిటిఎస్ ఎండి సూర్యతేజ, తదితరులు పాల్గొన్నారు.


Comments

-Advertisement-