రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సీమకు జలసిరులు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సీమకు జలసిరులు

  • హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి
  • 3,850 క్యూసెక్కులకు పెరిగిన కాలువ సామర్ధ్యం
  • వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం
  • జీడిపల్లి రిజర్వాయర్ వరకూ నీళ్లు తరలింపు
  • రోజు వారీ టార్గెట్లు పెట్టి పనులు పూర్తి చేయించిన సీఎం
  • ఈ నెలాఖరుకు కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకూ నీళ్లు
  • హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1, 2 ప్రాజెక్టుకు రూ.3,890 కోట్లు
  • తీరనున్న రాయలసీమ తాగు, సాగునీటి కష్టాలు
  • మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


అమరావతి, జూలై 15: కూటమి ప్రభుత్వం చొరవ, వేగవంతమైన నిర్ణయాలు రాయలసీమకు జలసిరులు తెచ్చాయి. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తైన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ముందు ప్రకటించినట్టుగానే వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. రూ.696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు తాగు, సాగునీరివ్వాలన్న సంకల్పంతో రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేజ్ 1, ఫేజ్ 2 కాలువ పనుల్ని పరుగులు పెట్టించారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్ధ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి కావటంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం కలిగింది. 

12 ఏళ్ల తర్వాత మళ్లీ 40 టీఎంసీలు

గతంలో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్ధ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకూ 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాలువల సామర్ధ్యం 3,850 క్యూసెక్కులకు పెరగటంతో ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనీవా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని జలవనరుల శాఖ పూర్తి చేసింది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా కలిగింది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల తాగు, సాగునీటి కష్టాల్ని తీర్చనున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. 

కూటమి వచ్చాకే మళ్లీ హంద్రీనీవా పనులు

2014-19లో రూ.4,317 కోట్లకు పాలనానుమతులు ఇచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువల విస్తరణ పనుల్ని 47 శాత మేర పూర్తి చేసింది. 2019 నుంచి 24 వరకూ గత ప్రభుత్వం ఆ పనుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా ఫేజ్ 1 ప్రధాన కాలువ పనుల్లో కదలిక వచ్చింది. 2025 ఏప్రిల్ లో మొదలైన విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తి అయ్యాయి. తదుపరి ఫేజ్- 2 పనుల్ని కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకూ నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మొత్తం రూ.3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది

Comments

-Advertisement-