భారతదేశ నూతన జాతీయ సహకార విధానం - 2025ని ప్రకటించిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా…
భారతదేశ నూతన జాతీయ సహకార విధానం - 2025ని ప్రకటించిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా…
కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా జూలై 24 న న్యూఢిల్లీలోని అటల్ అక్షయ ఊర్జా భవన్ లో భారతదేశ నూతన జాతీయ సహకార విధానం- 2025ని ప్రకటించారు.
2002లో అప్పటి ప్రభుత్వం (అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో) తొలి సహకార విధానాన్ని ప్రకటించిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం (ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో) ఈ రెండవ నూతన విధానాన్ని రూపొందించింది. ఇది గత రెండు దశాబ్దాలలో వచ్చిన సామాజిక-ఆర్థిక, సాంకేతిక మార్పులకు అనుగుణంగా రూపొందించబడింది.
ఈ విధానాన్ని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలోని 48 మంది సభ్యుల కమిటీ రూపొందించింది.
ఈ కమిటీ దేశవ్యాప్తంగా 17 సమావేశాలు, 4 ప్రాంతీయ వర్క్షాప్లు నిర్వహించి, వాటాదారుల నుంచి 648 సూచనలను స్వీకరించింది.
ముఖ్య లక్ష్యాలు(2025-2045):
సహకార రంగ విస్తరణ: దేశంలోని ప్రతి గ్రామంలో కనీసం ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సభ్యుల సంఖ్య పెంపు: 50 కోట్ల మంది ప్రజలను సహకార రంగ పరిధిలోకి తీసుకురావాలని తద్వారా సమానత్వ వృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్థిక నేరాలకు చెక్: సహకార సంస్థలను వృత్తిపరంగా, పారదర్శకంగా, సాంకేతికతతో కూడుకున్నవిగా, ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడం.
సహకార రంగ జీడీపీ వాటా వృద్ధి: 2034 నాటికి సహకార రంగం జీడీపీకి అందించే వాటాను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉపాధి కల్పన: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడం.
2047 నాటికి 'వికసిత్ భారత్' సాధన: సహకార రంగాన్ని 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక స్తంభంగా మార్చడం.
నూతన రంగాలలో విస్తరణ: పర్యాటకం, టాక్సీ సేవలు, బీమా, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో సహకార స్ఫూర్తిని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. టాక్సీ, బీమా రంగాల్లో త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఆర్థిక ఆకాంక్షల సాధన: గ్రామీణ ప్రజల ఆకాంక్షలను (ఉదాహరణకు గ్యాస్ సిలిండర్, ఇల్లు పొందిన వారు ఇస్త్రీ పెట్టెలు, స్కూటీలు కొనుగోలు చేయాలనే ఆకాంక్షలు) నెరవేర్చడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
పాలన మరియు పర్యవేక్షణ: ఈ విధానం అమలును పర్యవేక్షించడానికి 'నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆన్
కోఆపరేషన్ పాలసీ' మరియు 'పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ' వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
మోడల్ గ్రామాలు: ప్రతి తాలూకాలో ఐదు మోడల్ సహకార గ్రామాలను అభివృద్ధి చేయడం, మరియు ప్రతి జిల్లాలో ఒక మోడల్ సహకార గ్రామాన్ని బహుళార్ధసాధక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) కేంద్రంగా అభివృద్ధి చేయడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి.
సభ్య-కేంద్రీకృత విధానం: ఈ విధానం సభ్యుల సంక్షేమాన్ని ప్రాథమిక లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
సమ్మిళిత అభివృద్ధి: దళితులు, ఆదివాసీలు, మహిళలు వంటి వెనుకబడిన వర్గాల భాగస్వామ్యాన్ని ఆర్థిక అభివృద్ధిలో పెంచడంపై విధానం దృష్టి పెట్టింది