రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

  • 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం
  • రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి
  • హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం
  • అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు


అమరావతి, జూలై 5: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, ఆర్ధిక శాఖ, సీసీఎల్ఏకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పలనాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్‌పిని ఆహ్వానించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియచేసింది. 

రాజధాని పనులకు కృష్ణా నది నుంచే ఇసుక

రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణానది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు జరుగుతున్న రీత్యా రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టులకు 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి అవసరం అయ్యే ఇసుకను ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. రెండేళ్ల పాటు రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఇసుక డీసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్ల మేర వ్యయం కానున్నట్టు అథారిటీ సమావేశంలో అధికారులు తెలిపారు. 

రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు

అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా సీఆర్డీఏ అథారిటి ఆమోదాన్ని తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు 2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడెమీకి 12 ఎకరాలు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ అమోదం ఇచ్చింది. అలాగే ఆదాయపు పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 2 ఎకరాలను, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలను కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. అలాగే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూప్‌లకు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి సమీపంలో E-15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. 

అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు

రాజధాని అమరావతిలో స్ఫూర్తినిచ్చేవారి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఎకో పార్కులకూ మంచి పేర్లను పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయం వేగంగా రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని అన్నారు. అమరావతిలో ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాజధానిలో నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, గడువులోగా పూర్తి చేసేలా నిర్దేశించాలని ముఖ్యంత్రి చంద్రబాబు అన్నారు.


Comments

-Advertisement-