పీ-4 మోడల్ లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి
పీ-4 మోడల్ లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 మోడల్ లో వెనుకబడిన తరగతుల హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనిలో భాగంగా దాతలు, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద లబ్ధి పొంది ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థుల సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లో భాగంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబునాయుడు పీ-4 మోడల్ కు శ్రీకారం చుట్టారన్నారు. సామాజిక బాధ్యత కింద ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న10 శాతం మంది ధనికులు... 20 శాతం మంది పేదలను ఆదుకునేలా పీ-4 కార్యక్రమం రూపొందించారన్నారు. మార్గదర్శులు, బంగారు కుటుంబాల పేరుతో ఎంతో సదుద్దేశంతో రూపొందించిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సహకారమందించాలని ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం విద్యార్థులకు మంత్రి సవిత పిలుపునిచ్చారు. 2016-19 మధ్య కాలంలో ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద లబ్ధి పొందిన ఎందరో విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉండడం ఎంతో ఆనందకరమన్నారు. ఇలా ప్రభుత్వ సహకారంతో ఆర్థికంగా ఉన్నత స్థానాలల్లో ఉన్న వారు తమకు తోచిన రీతిలో వెనుకబడిన తరగతుల హాస్టళ్లలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సాయమందించడానికి ముందుకు రావాలని కోరారు.
ప్రజా భాగస్వామ్యంతో హాస్టళ్ల నిర్వహణ
ప్రభుత్వపరంగా బీసీ హాస్టళ్ల మెరుగుకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి సవిత తెలిపారు. సకాలంలో డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తోందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేశామన్నారు. తల్లికి వందనం పథకం ఇంట్లో ఎందరు విద్యార్థులు ఉంటే అందరికీ రూ.13 వేల చొప్పున్న అందజేశామన్నారు. బీసీ హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలా బీసీ బిడ్డలకు నాణ్యమైన భోజనం పాటు భద్రతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. అదే సమయంలో సామాజిక సేవపై ఆసక్తి కలిగే దాతల సాయంతో పేద విద్యార్థులకు స్వల్ప కాలంలో మెరుగైన సౌకర్యాలు అందించగలుగుతామన్నారు. పీ-4 విధానంలో ప్రజల భాగస్వామ్యంతో హాస్టళ్ల నిర్వహణ మరింత సులభంగా మారుతుందని మంత్రి తెలిపారు.
ఈ మెయిళ్లతో సంప్రదింపులు
కార్పొరేట్ కు ధీటుగా బీసీ హాస్టళ్లలో విద్య అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం విద్యార్థులు తమకు తోచినరీతిలో బీసీ హాస్టళ్లకు అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ మేరకు వారందరికీ ఈ మెయిళ్ల ద్వారా సంప్రదించినట్లు మంత్రి వెల్లడించారు. ఏదైనా హాస్టల్ ను దత్తత తీసుకోవొచ్చునన్నారు. ఒకరిద్దరు విద్యార్థులను దత్తత తీసుకుని, వారి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించాలని సూచించారు. తమ స్థాయికి తగిన రీతిలో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, మరమ్మతులు చేయడం, తాగునీటి కల్పనకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం వంటి పనులకు ఆర్థిక సాయమందించొచ్చునన్నారు. విద్యుత్ సదుపాయం కోసం సోలార్ విద్యుత్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేయొచ్చునన్నారు. దాతలు అదనపు వసతుల గదుల నిర్మాణంతో పాటు లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయొచ్చునన్నారు. ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అందజేయొచ్చునన్నారు. హాస్టళ్ల పరిసరాలను సుందరీకరణకు కూడా దాతలు ముందుకు రావొచ్చునన్నారు. నిర్మాణాలు, మెటీరియళ్లపై దాతలు పేర్లు ప్రచురిస్తామని, దీనివల్ల మరింత మంది స్ఫూర్తి పొందడానికి అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగి, పేద బీసీ విద్యార్థులకు అండగా నిలవాలనుకున్నవారు directorapbcwelfare@gmail.com మెయిల్ కు గాని, 6300876401, 7989344521 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం విద్యార్థులకు మంత్రి సవిత ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.