పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించండి
పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించండి
- 79 మంది స్పెషల్ ఆఫీసర్ ల నియామకం
- ఆయా అధికారులకు నిర్దేశించిన గ్రామాన్ని సందర్శించి తనిఖీలు చేపట్టాలి
- స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు సంబంధించి సమాచారాన్ని త్వరితగతిన పంపాలి
- జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, సెప్టెంబర్ 05 (పీపుల్స్ మోటివేషన్):-
గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రూపొందించిన "పల్లెకు పోదాం" కార్యక్రమాన్ని శనివారం నుండి ప్రారంభించడం జరుగుతోందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు,మున్సిపల్ కమిషనర్లు తదితరులతో పల్లెకు పోదాం, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలను బాగు చేయాలన్న సత్సంకల్పంతో పల్లెకు పోదాం"వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందుకోసం 79 మంది జిల్లా అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామని, జిల్లాలో ప్రతి మండలంలో 3 గ్రామాల చొప్పున 79 గ్రామాలను ఎంపిక చేశామని, 79 మంది అధికారులు 79 గ్రామాలకు సందర్శిస్తారని, వీరు ఏ గ్రామానికి వెళ్లాలి అనే సమాచారాన్ని ఇప్పటికే అధికారులకు తెలియచేశామన్నారు. వీరంతా శనివారం ఉదయం 9 గంటలకు నిర్దేశించిన గ్రామానికి చేరుకొని, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు హాస్పిటల్, హాస్టల్ తదితర ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, తాగునీరు పరీక్షిస్తున్నారా, సక్రమంగా సరఫరా అవుతోందా, ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, ఇళ్ళ నిర్మాణాలు ఎలా సాగుతున్నాయి, రోడ్లు సదుపాయం, మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి తదితర అన్ని అంశాలు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు అన్ని శాఖలకు సంబంధించి చెక్ లిస్ట్ లాగా ప్రొఫార్మాలు తయారు చేశామని, ఆయా గ్రామాల్లో ఉన్న సమగ్రమైన పరిస్థితులన్నీ ఆన్లైన్ లో పొందుపరచబడిన ప్రొఫార్మాలో తెలియచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తదుపరి ఈ సమస్యలను పరిశీలించి ఆయా శాఖల ద్వారా తగిన పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఈవోఆర్డీ తమ తమ టీములతో స్పెషల్ ఆఫీసర్ వెంట వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా గ్రామాలకు మంచి చేయాలన్న సంకల్పంతో చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు సంబంధించి అయి శాఖలు సమాచారాన్ని 9 వ తేదీ లోపు పంపాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.మున్సిపల్ కమిషనర్లు, మెప్మా, డీఈవో, బిసి వెల్ఫేర్, డి ఆర్ డి ఎ, ఐసిడిఎస్ శాఖల సమాచారాన్ని త్వరితగతిన ఆన్లైన్ లో అప్లోడ్ చేసి, అప్లోడ్ చేసిన సమాచారాన్ని సూపర్వైజరీ అధికారులచే నిర్ధారించి పంపాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, డిపివో భాస్కర్,అధికారులు పాల్గొన్నారు.
