గతంలో పోలిస్తే నేడు అత్యున్నత సాంకేతికత అందుబాటు
గతంలో పోలిస్తే నేడు అత్యున్నత సాంకేతికత అందుబాటు
- ఎక్కువ మందికి అధునాతన శస్త్ర చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యం
- డాక్టర్ తుమ్ములూరి శిద్ధయ్య, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ఏఐసీటీఈ ఎక్స్ పర్ట్ మెంబర్, నాక్ పీర్ టీమ్ చైర్మన్
మారుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడమే లక్ష్యంగా డాక్టర్లంతా కృషిచేయాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ఎఐసిటిఇ ఎక్సర్ట్‌మెంబర్, నాక్ పీర్ టీమ్ చైర్మన్ డాక్టర్ తుమ్ములూరి శిద్ధయ్య తెలిపారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని సెమినార్ హాల్లో 'అధునాతన టెక్నాలజీ-వైద్య విద్యలో అన్వయించటం-జాతీయ విద్యావిధానం-2020'పై బుధవారం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాల ప్రిన్సిపాళ్లు, ఇతర కళాశాల నిర్వహణ మండలి ప్రతినిధులు ఇందులో పాల్గన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో ముఖ్యఅతిథిగా తూములూరి సిద్ధయ్య మాట్లాడుతూ కత్రిమమేథ, ఎఐ టూల్స్ వంటివి ఉపయోగించుకుని సులభంగా వైద్య సేవలు అందించే సృజనాత్మక టెక్నాలజీ నేడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది వైద్య సేవలను గతంతో పోలిస్తే ఇప్పుడు అత్యంత సులభంగా అందించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంతో పోలిస్తే నేడున్న టెక్నాలజీ ప్రభావంతో వైద్య విద్యలో సరికొత్త పద్ధతులు, చికిత్సలు, పాటించాల్సిన విషయాలపై అవగాహన పెంపొందటానికి విపరీతమైన వైద్య విజ్ఞాన సంపద కూడా అందుబాటులో ఉందని వివరించారు. అందువల్ల ఆయా టెక్నాలజీ, వైద్య పద్ధతులను ప్రతిఒక్కరూ అందిపుచ్చుకోవటం ద్వారా రోగులకు మెరుగైన, నాణ్యమైన, వేగవంతమైన చికిత్సలు చేయటానికి అవకాశం ఉందన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్య కళాశాలల్లో ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్లు, ఇతర మౌళిక వసతులు పెంచుకోవటం ద్వారా రోగులకు మంచి సాంత్వన ఇచ్చే అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అధునాతన శస్త్ర చికిత్సలు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా కృషిచేస్తున్నాయన్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) కూడా ఆ దిశగా కృషిచేస్తోందన్నారు. వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల పెంపునకు ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యా కోర్సులకు తరగతులతోపాటుగా అనుబంధ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చూడాల్సివుందన్నారు. వైద్య విద్య పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చే సమయానికి పూర్తి నైపుణ్యంతో వైద్య విద్యార్థి ఉండేలా చూడటమే అందరి లక్ష్యంగా ఉండాలని సూచించారు. రోగులతో వైద్యుడు వ్యవహరించాల్సిన తీరుతో పాటు నైతికతను ఒక అంశంగా వైద్యవిద్యలో చేర్చారని గుర్తుచేశారు. వైద్యవిద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థి మంచి వైద్యుడిగా సేవలందించేలా ఇది ఉపకరిస్తుందని వివరించారు. వైద్య వృత్తిని కొనసాగించినంత కాలం ఇవి తోడుగా ఉండేలా ఎన్‌ఇసి-2020 ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు కాపాడుకోవాల
దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలలకు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకులు ఇస్తుందని వాటిని కాపాడుకోవాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ విశ్రాంత రిజిస్ట్రార్ డాక్టర్ ఎఐసిటిఇ ఎక్సర్ట్‌మెంబర్, నాక్ పీర్ టీమ్ చైర్మన్ డాక్టర్ తుమ్ములూరి శిద్ధయ్య కోరారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాలులో 'ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ర్యాంకింగ్‌లు ఇస్తారనీ, మెడికల్ కాలేజీలు మంచి ర్యాంకింగ్ వచ్చేలా కృషిచేయాలని కోరారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలు వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించటం ద్వారా మంచి ర్యాంకింగ్‌లు సాధించటంతోపాటుగా కాపాడుకునేందుకు కృషిచేయాలని కోరారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ వి.రాధికారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాలల యాజమాన్యాలు మంచిర్యాంకులు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ డీ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ, రీసెర్చ్ విభాగం కమిటీ సభ్యులు డాక్టర్ తుమ్మల కార్తీక్ తదితరులు పాల్గన్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య విద్యలో నాణ్యత పెంపుపై దృష్టి సారించామన్నారు. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం కేవలం థియరీ పరీక్షలతో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించడం కాదనీ, మెడికల్ ప్రాక్టీస్‌లోని అనేక అంశాల్లో విద్యార్థులు సామర్థ్యం పెంచుకోవడం చాలా కీలకమన్నారు. వైద్య విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక (ప్రాక్టికల్) విజ్ఞానం పెంపునకు కూడా కృషిచేస్తున్నామన్నారు. అండర్‌గ్రాడ్యుయేట్ ప్రీక్లినికల్ ట్రైనింగ్‌ను క్లినికల్ ట్రైనింగ్‌లో భాగం చేశారన్నారు. వైద్య కళాశాలల్లో స్కిల్ ల్యాబ్‌లను తప్పనిసరి చేశాం. వీటిలో నైపుణ్యాలు పెంచుకునేందుకు విద్యార్థులకు అవకాశాలుంటాయని వివరించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ వి.రాధికారెడ్డి మాట్లాడుతూ యూనివర్శిటీ గైడ్‌లెన్స్‌కు అనుగుణంగా మెడికల్ కళాశాలల యాజమాన్యాలు అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ డీ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ, రీసెర్చ్ విభాగం కమిటీ సభ్యులు డాక్టర్ తుమ్మల కార్తీక్ తదితరులు పాల్గన్నారు. అనంతరం తుమ్ములూరి శిద్ధయ్యను ఘనంగా యూనివర్శిటీ తరపున సత్కరించారు.