ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను మరింత అభివృద్ధి చేస్తాం
ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను మరింత అభివృద్ధి చేస్తాం
- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
- శ్రీశైలం, అహోబిలం, బెలూం గుహలు, యాగంటి తదితర ప్రదేశాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ
అమరావతి/కర్నూలు, సెప్టెంబర్ 10 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్ కు వెళ్లాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం నుండి విజయవాడ వస్తూ మార్గమధ్యలో కర్నూలు చేరుకున్న మంత్రి దుర్గేష్ ఫ్లైట్ కు సమయం ఉండటంతో సమీపంలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శంగా రాక్ గార్డెన్ ను కలియ తిరిగారు. హరిత రిసార్ట్స్ ను, హరిత రెస్టారెంట్ ను పరిశీలించారు. అక్కడి అధికారులతో, సిబ్బందితో వివరాలు ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీలో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో రాక్ గార్డెన్ ఒకటని అన్నారు. ఇక్కడ సహస సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. ఓర్వకల్లులో హరిత రిసార్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక్కడి సహజ సిద్ధ నిర్మాణాలు, కట్టడాలు రాష్ట్ర గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయన్నారు. ఓర్వకల్ ఎయిర్ పోర్టుతో స్థానిక పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరిగిందన్నారు. ప్రపంచ పర్యాటకులు సైతం ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించేలా అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, అహోబిలం, బెలూం గుహలు, యాగంటి తదితర ప్రదేశాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగా బాహుబలి, డాకు మహారాజ్ తదితర సినిమా షూటింగ్ లు జరిగాయని, రాబోయే రోజుల్లో రాక్ గార్డెన్ లో మరిన్ని షూటింగ్ లు జరుగుతాయని పేర్కొన్నారు.సీఎం చంద్రబాబునాయుడు చొరవతో, కేంద్ర సహకారంతో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకానుందని తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.
అనంతరం నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను రక్షించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. నేపాల్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగువారికి అండగా నిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలిపారు. తెలుగు ప్రజల భద్రత తమకు ముఖ్యమన్న మంత్రి దుర్గేష్ తెలుగు ప్రజలను వీలైనంత త్వరగా సురక్షితంగా ఏపీకి తీసుకురావడానికి అవసరమైన రక్షణ, సహాయ కార్యకలాపాలను మంత్రి లోకేష్ తో కలిసి సమన్వయం చేస్తాను అని ఈ సందర్భంగా వెల్లడించారు.