రోడ్డు భద్రత కోసం అన్నమయ్య పోలీసుల 'బొమ్మ' కథ!
రోడ్డు భద్రత కోసం అన్నమయ్య పోలీసుల 'బొమ్మ' కథ!
అధికారుల సృజనాత్మకతతో వాహనదారులకు కొత్త పాఠం,
అన్నమయ్య జిల్లా, మదనపల్లె: ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న రహదారులపై, ప్రాణాలను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తుపాకులు, లాఠీల కంటే సృజనాత్మక ఆలోచనే గొప్ప ఆయుధం అని నిరూపించేలా, మదనపల్లె సబ్-డివిజన్ పోలీస్ యంత్రాంగం ఒక వినూత్న 'కటౌట్ కథ'ను ప్రారంభించింది.
ఎస్పీ ఆలోచనకు క్షేత్రస్థాయిలో అమలు..
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సూచనల మేరకు, రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లాక్ స్పాట్స్‌పై దృష్టి సారిం చారు. ఈ మిషన్‌కు నేతృత్వం వహించిన మదనపల్లె సబ్-డివిజన్ డీఎస్పీ ఎస్. మహేంద్ర , మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో, ముదివేడు ఎస్‌ఐ దిలీప్ కుమార్ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
రహదారి పక్కన మెరిసిన 'నిజం కాని' పోలీస్ బృందం. అధికారులు రోడ్డు పక్కన రెండు కటౌట్‌లను ఏర్పాటు చేశారు. మొదటిది... అన్నమయ్య జిల్లా పోలీసులకు చెందిన గస్తీ వాహనం (పెట్రోలింగ్ వెహికల్) ఆకారంలో ఉండే కటౌట్. ఇది దూరం నుంచి చూసేవారికి అచ్చు గుద్దినట్లుగా నిజమైన పోలీస్ కారులాగే కనిపిస్తుంది. దాని పక్కనే, ట్రాఫిక్ యూనిఫామ్ ధరించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆకారపు బొమ్మను ఉంచారు. ఆ బొమ్మ చేతిలో 'GO SLOW' అని రాసిన బోర్డు ఉంది. ఈ కటౌట్‌లను చూసిన వాహనదారులు, నిజంగానే పోలీసులు తనిఖీ కోసం మాటు వేశారని భ్రమపడి, వెంటనే తమ వాహనాల వేగాన్ని తగ్గించుకుంటున్నారు. ఈ 'నిజం కాని' పోలీస్ బృందం, అతివేగానికి అడ్డుకట్ట వేస్తూ, నిర్లక్ష్యాన్ని నివారిస్తోంది.
ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్. మహేంద్ర మాట్లాడుతూ, "ప్రజలు అనుసరించే నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రాణ నష్టాలకు ప్రధాన కారణం. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కర్వ్ క్రాసింగ్‌ల వద్ద ఓవర్‌టేక్ చేయడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రజలు తమ ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవాలంటే, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి" అని గట్టిగా హెచ్చరించారు.ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని, విశ్వం కాలేజీ, కడప క్రాస్, దోమ్మన్నభావి సర్కిల్ వద్ద ఈ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, భవిష్యత్తులో జిల్లాలోని అన్ని బ్లాక్ స్పాట్స్ మరియు రద్దీ ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీస్ శాఖ ప్రజల రక్షణకే కట్టుబడి ఉందని, ప్రతి డ్రైవర్ తన బాధ్యతను గుర్తిస్తేనే సురక్షిత సమాజాన్ని నిర్మించగలమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.