భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్ళరాదు
సముద్రంలో ఉన్న మత్స్యకారులు తప్పనిసరిగా అక్టోబర్ 21 లోపు తీరానికి చేరుకోవాలి
తీర ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
—జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు, అక్టోబర్ 19 :
ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని,దీని ప్రభావంతో *మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం* ఉన్నందున జిల్లాలోని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
ఈ అల్పపీడనం 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం,పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంంతాల్లో *వాయుగుండంగా బలపడే* అవకాశం ఉందన్నారు.దీని ప్రభావంతో బుధవారం నుంచి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు
అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం నుండి దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతంలోకి సముద్రయాత్రలు చేయరాదని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ అయినట్లు కలెక్టర్ తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, సముద్రంలో ఉన్న మత్స్యకారులు తప్పనిసరిగా అక్టోబర్ 21 లోపు తీరానికి చేరుకోవాలన్నారు. వాతావరణ శాఖ సూచన మేరకు అక్టోబరు 22 మరియు 23 అక్టోబర్ తేదీల్లో సముద్రయాత్రలు చేయరాదని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 45–65 కిమీ వరకు ఉండవచ్చన్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జిల్లా అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ సూచించారు.