చిన్నారుల కోసం కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు
చిన్నారుల కోసం కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు
ఇందులో 11 గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు
మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
రాష్ట్రంలోని ముఖ్యమైన 15 ప్రభుత్వాసుపత్రుల్లో 'న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్' (ఎన్.ఆర్.సి.లు) త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులకు సేవలందుతాయి. ఈ 15లో 11 గిరిజన ప్రాంతాల్లో వస్తాయని పేర్కొన్నారు. వీటన్నిటిలో కలిపి 115 పడకలు చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 21 ఎన్ఆర్సీలు ఉండగా... వీటిల్లో 340 పడకలు ఉన్నాయని తెలిపారు.
2 వారాలపాటు వైద్యంతోపాటు సమాంతరంగా పౌష్ఠికాహారం
ఆశా, ఎ.ఎన్.ఎం.ల నుంచి అందే సమాచారంతో పీహెచ్సీ వైద్యులు పరిక్షలు చేసిన అనంతరం సదరు చిన్నారులను సమీపంలోని ఎన్ఆర్సీలకు పంపుతారు. ఈ కేంద్రాల్లో చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా అని పరిశీలించి ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కేంద్రాల్లోనే ఉండే న్యూట్రిషన్ కౌన్సిలర్లు చిన్నారులకు ఎలాంటి ఆహారం (పీడింగ్) ఇవ్వాలన్న దాని పై చేసిన సిఫారసుననుసరించి సిబ్బంది సమకూరుస్తారు. ఇలా 2 వారాలపాటు వైద్యంతోపాటు సమాంతరంగా పౌష్టికాహారం (ప్రొటీన్ రిచ్ పుడ్) చిన్నారులకు అందిస్తారు. కొనసాగుతున్నాయి.
10 పడకలతో కొత్తగా వార్డులొచ్చే ఆసుపత్రులు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏరియా ఆసుపత్రి, ముంచింగిపట్టు, చింతపల్లి సీహెచ్సిల్లో వచ్చే ఈ సెంటర్లలో 10 చొప్పున పడకలు ఉంటాయి. అనకాపల్లి జిల్లా అసుపత్రి, బాపట్ల, పల్నాడు ఏరియా ఆసుపత్రులు, పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా ఆసుపత్రి, నంద్యాల జిల్లా నంద్యాల బోధనాసుపత్రి, సున్నిపెంట ఏరియా ఆసుపత్రిలో వచ్చే ఈ కేంద్రాల్లో 10 చొప్పున పడకలు ఉంటాయి. ఈ పడకల కోసం ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పడతాయి.
5 పడకల ఆసుపత్రులు
పార్వతీపురం జిల్లా సాలూరు , పాలకొండ ఏరియా ఆసుపత్రులు, భద్రగిరి , కురుపాం, చిన్నమరంగి సీహెచ్సీల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల ఏరియా ఆసుపత్రి, రామవరం సీహెచ్సీల్లో ఉన్న పడకలకు అదనంగా ఐదు చొప్పున ఈ సెంటర్ల కింద రానున్నాయి. 13 బోధనాసుపత్రుల్లో 20 చొప్పున, 8 జిల్లా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పది చొప్పున పడకలు ఉన్నాయి. వీటి ద్వారా చిన్నారులు ప్రయోజనం పొందుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ కేంద్రాల కార్యకలాపాలు కొనసాగుతాయి.
