హిందుజా గ్రూప్‌తో రూ.20 వేల కోట్ల ఒప్పందం
హిందుజా గ్రూప్‌తో రూ.20 వేల కోట్ల ఒప్పందం
- ఏపీకి పరిశ్రమల ఊపు
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, నవంబర్ 3 (పీపూల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు హిందుజా గ్రూప్ మధ్య రూ.20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేయబడింది. ఈ ఒప్పందం సంతకం కార్యక్రమంలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ అశోక్ పి. హిందుజా, యూరప్ ఛైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా ఇన్వెస్ట్మెంట్స్ & ప్రాజెక్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ వివేక్ నందా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి, స్వచ్ఛ ఇంధన అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఉన్న 1,050 మెగావాట్ల హెచ్‌ఎన్‌పీసీఎల్ ప్లాంట్‌ను అదనంగా 1,600 మెగావాట్ల సామర్థ్యంతో విస్తరించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో భారీ స్థాయిలో సౌర, వాయు విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని మరింత బలపరచనుంది.
అదే విధంగా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఆధునిక సాంకేతికతతో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేసి పచ్చపరిశ్రమల వృద్ధికి దోహదం చేయనున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “హిందుజా గ్రూప్‌తో కుదిరిన ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పరిశ్రమల రూపురేఖలను మార్చనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా పరిశ్రమలు, ఉపాధి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో రాష్ట్రం దేశానికి మోడల్‌గా నిలుస్తుంది” అని తెలిపారు. ఎల్ఈ ఒప్పందం రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
