కొడంగల్‌లో విద్యార్థుల కోసం అక్షయపాత్ర నూతన కిచెన్
 కొడంగల్‌లో విద్యార్థుల కోసం అక్షయపాత్ర నూతన కిచెన్
- ఎన్కేపల్లిలో రెండెకరాల్లో నిర్మాణం
- నవంబర్ 14న భూమిపూజ
- కొడంగల్‌లో మిడ్‌డే మీల్ విస్తరణ
కొడంగల్, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యకర భవిష్యత్తు కోసం అక్షయపాత్ర ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌ను నిర్మించనుంది. ఈ క్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, నవంబర్ 14న జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో ఈ కిచెన్ నిర్మాణం చేపట్టబడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.7 చొప్పున చెల్లిస్తుండగా, నాణ్యత ప్రమాణాలను కాపాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ రూ.25 వరకు వ్యయం చేయనుంది. ప్రభుత్వ నిధులకు అదనంగా అయ్యే ఖర్చును సంస్థ స్వయంగా భరిస్తూ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల సాయంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
గత ఏడాది నుంచే కొడంగల్‌లోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం విజయవంతంగా నడుస్తోంది. ప్రతి రోజు ఉదయం దాదాపు 28 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ చర్యకు తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ సొంత వనరులతో అమలు చేస్తున్న ఈ పథకం, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారుతోంది. విద్యార్థుల పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
