70 ఏళ్ళ తర్వాత గిరిజన ‘గూడెం’లో తొలి విద్యుత్ కాంతులు
70 ఏళ్ళ తర్వాత గిరిజన ‘గూడెం’లో తొలి విద్యుత్ కాంతులు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ
- ఐదు నెలల్లో పరిష్కారం
అల్లూరి సీతారామరాజు జిల్లా, నవంబర్ 5 ( పీపుల్స్ మోటివేషన్): ఏడు దశాబ్దాల తర్వాత కూడా విద్యుత్ సౌకర్యం అందని గిరిజన గ్రామమైన గూడెం చివరకు వెలుగులు చూసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ పర్వత గ్రామంలో బుధవారం నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. కార్తీక పౌర్ణమి వెలుగులతో పాటు గూడెం ఇళ్లలో మొదటిసారిగా విద్యుత్ కాంతులు ప్రసరించడంతో గ్రామం ఆనందంతో నిండిపోయింది.
అడవుల మధ్య, పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం వరకు అడుగుపెట్టడమే కష్టతరమైన పరిస్థితి. విద్యుత్, రహదారి, తాగునీరు వంటి కనీస వసతులు లేకపోవడంతో గిరిజనులు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట అడవి జంతువుల భయంతో వెలుతురు లేక చీకట్లో గడపాల్సిన దుస్థితిని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఐదు నెలల క్రితం తీసుకువచ్చారు. సమస్యను అర్థం చేసుకున్న ఆయన, గిరిజనుల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి సూచనలపై, రాష్ట్ర విద్యుత్ శాఖ, ఏపీ జెన్కో అధికారులతో సమన్వయం చేసి నాన్-PVTG ప్రాజెక్ట్ నిధుల ద్వారా గూడెం విద్యుదీకరణకు ఆమోదం పొందారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర నిధులతో పని పూర్తి చేయబడింది.
- 17 ఇళ్లకు – 9.6 కి.మీ లైన్, 217 స్తంభాలు
గ్రామంలో మొత్తం 17 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి 9.6 కిలోమీటర్ల దూరం మేరకు 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. సుమారు రూ. 80 లక్షల వ్యయంతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విద్యుత్‌తో పాటు ప్రతి ఇంటికీ 5 బల్బులు, 1 ఫ్యాన్ అందించారు. ప్రత్యామ్నాయ పవర్ సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానించారు. గూడెం ప్రజలు తమ ఇళ్లలో వెలుగులు వెలిగిన మొదటి రాత్రిని పండుగలా జరుపుకున్నారు. “విద్యుత్ వచ్చిన రోజు మా జీవితంలో దీపావళిలా అనిపించింది” అని గ్రామస్తులు తెలిపారు.

