బీహార్‌లో ఓట్ల తొలగింపు వివాదం
బీహార్‌లో ఓట్ల తొలగింపు వివాదం
- ఎన్డీయేపై ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు
- ఎన్నికలను హస్తగతం చేసుకునేందుకు ఎన్డీయే పన్నాగం: ప్రియాంక గాంధీ ఫైర్
పాట్నా, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): బీహార్‌లో ఓటర్ల జాబితాలను అక్రమంగా మార్పులు చేసి, ఎన్నికలను ప్రభావితం చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీయే కూటమి కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో మహిళలు సహా సుమారు 65 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆమె మండిపడ్డారు.
ప్రియాంక గాంధీ బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ చంపారన్ జిల్లాలో బుధవారం పర్యటించారు. వాల్మీకి నగర్, చన్‌పాటియాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, అందుకే గెలుపు కోసం ఎలాగైనా మార్గాలు అన్వేషిస్తూ ఓట్ల చోరీకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఎన్డీయే పాలన దేశాన్ని ప్రజాస్వామ్య మార్గం నుంచి దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని ప్రియాంక విమర్శించారు. ఈ తరహా చర్యలు చూసి దేశ భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలో నిజమైన ఎన్నికలే జరుగుతాయా లేదా అన్న సందేహం ఉత్పన్నమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
