కర్ణాటకలో విషాదం
కర్ణాటకలో విషాదం
- భూ వివాదంతో విసిగిపోయిన రైతు నిప్పంటించుకుని ఆత్మహత్య
బెంగళూరు, నవంబర్ 5 ( పీపుల్స్ మోటివేషన్): భూ వివాదాన్ని అధికారులు పరిష్కరించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మాండ్య జిల్లాకు చెందిన రైతు మంజెగౌడ జిల్లా పరిపాలన కార్యాలయం వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మంజెగౌడ పొలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండేది. అయితే ఆ భూమి తమదేనంటూ అటవీ శాఖ అధికారులు, ముగ్గురు స్థానికులు తరచూ వేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటూ వస్తున్నారని, దీనివల్ల తీవ్ర ఆందోళనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బ్యాంకు రుణంతో వ్యవసాయం సాగిస్తున్న మంజెగౌడ పలుమార్లు అధికారులను ఆశ్రయించినా సమస్యను పరిష్కరించలేదని వాపోయారు.
ఫిర్యాదులు – విసుగుతో తీసుకున్న దారుణ నిర్ణయం
అక్టోబర్ 18న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి భూ వివాదంపై ఫిర్యాదు చేసిన మంజెగౌడ, చర్యలు తీసుకోవాలని కోరాడు. స్పందన రాకపోవడంతో నవంబర్ 4న జిల్లా పరిపాలన కార్యాలయానికి చేరుకున్నాడు. మనస్తాపానికి లోనై కార్యాలయం ఎదుటనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే మంటలను ఆర్పి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర కాలిన గాయాలతో బుధవారం ఉదయం ఆయన మరణించాడు.
ఈ ఘటనపై మాండ్య డిప్యూటీ కమిషనర్ స్పందించి, దర్యాప్తునకు ఆదేశించారు. ఘటన దురదృష్టకరమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఈ వ్యవహారంపై శాఖ అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు వెల్లడించారు. రైతు ఆత్మహత్యల సమస్య మరలా ముందుకు రావడంతో, భూ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలపై ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి.
