చనాకా–కొరటా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
చనాకా–కొరటా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
- రైతుల నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
- నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కవిత డిమాండ్
ఆదిలాబాద్, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా–కొరటా ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన ఆమె, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 90 శాతం వరకు పూర్తయినా, గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని ఆమె పేర్కొన్నారు.
ప్రాజెక్టు కోసం తవ్విన కాల్వల్లో వరద నీళ్లు ఉప్పొంగి రైతుల పంటలు నష్టపోతున్నాయని ఆమె తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్వీర్యతకు నిదర్శనమని కవిత విమర్శించారు.
కొరట గ్రామంలోని నిర్వాసితులు ఇంకా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, మొత్తం 213 మంది నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
“ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదు” అని కవిత స్పష్టం చేశారు.
