అంతర్జాతీయ గుర్తింపు సాధించిన మంత్రి సీతక్క
అంతర్జాతీయ గుర్తింపు సాధించిన మంత్రి సీతక్క
- నెదర్లాండ్స్‌లో మహిళా నాయకత్వ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం
హైదరాబాద్, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన మంత్రి సీతక్కకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయ్సెస్ గ్లోబల్ ఫెలోషిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజాసేవల రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాయకులను ఈ సదస్సు ఆహ్వానిస్తుంది. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం సీతక్క చూపుతున్న కృషిని గుర్తించి ఈ గౌరవం అందజేయడం విశేషం.
ఈ నెలలో నెదర్లాండ్స్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మహిళా–శిశు సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి చొరవల గురించి సీతక్క వివరిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించడం పట్ల మంత్రిత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
