సంక్రాంతి వరకూ ఆప్కో లో డిస్కౌంట్ అమ్మకాలు
సంక్రాంతి వరకూ ఆప్కో లో డిస్కౌంట్ అమ్మకాలు
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
- 40 శాతం డిస్కౌంట్ కు చేనేత అమ్మకాలు
- డిస్కౌంట్ అమ్మకాలతో పెరిగిన రోజువారీ విక్రయాలు
- రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెరిగిన అమ్మకాలు
- త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : మంత్రి సవిత
అమరావతి : రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లోనూ చేనేత వస్త్రాల వినియోగంపై మక్కువ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ ల్లో చేనేత వస్త్రాలను 40 శాతం డిస్కౌంట్ పై విక్రయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో డిస్కౌంట్ అమ్మకాలు వచ్చే సంక్రాంతి వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిస్కౌంట్ లో అమ్మకాలతో అటు ప్రజలకు చేనేత వస్త్రాలను మరింత చేరువ చేసే అవకాశం కలుతోందన్నారు. అదే సమయంలో చేనేత వస్త్రాల విక్రయాల పెరుగుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసాతో కూడిన ఉపాధి లభిస్తోందని తెలిపారు.
రూ.9 లక్షలకు పెరిగిన అమ్మకాలు
40 శాతం డిస్కౌంట్ కు ఆప్కో షో రూమ్ ల ద్వారా చేనేత వస్త్రాలను విక్రయించడం వల్ల అమ్మకాలు సైతం పెరిగినట్లు మంత్రి సవిత వెల్లడించారు. డిస్కౌంట్ ఇవ్వడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో షో రూమ్ ల ద్వారా రోజుకు సరాసరి రూ.3 లక్షల చొప్పున విక్రయాలు జరిగేవన్నారు. 40 శాతం డిస్కౌంట్ తో అమ్మకాలు ప్రారంభించిన తరవాత రోజువారీ అమ్మకాలు రూ.9 లక్షలకు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. డిస్కౌంట్ విక్రయాలతో పాటు చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో పాటు ఆయా వయస్సుల వారికి అవసరమైన రెడీ మేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తున్నామన్నారు. దీంతో చేనేత వస్త్రాల కొనుగోలు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు
చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో విశాఖ, కర్నూలు, కడప వంటి నగరాలతో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు, బజార్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.
