Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ, 20 మంది మృతి
Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ, 20 మంది మృతి
చేవెళ్ల, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):-రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై కంకరతో లోడైన లారీ ఒక ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టడంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుంచి తాండూర్ వైపు బయలుదేరగా, మీర్జాగూడ సమీపంలోని ఖానాపూర్ గేట్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ వేగం అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైపోగా, పలువురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న వెంటనే చేవెళ్ల పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.
