బీహార్‌లో మార్పుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన పొంగులేటి
బీహార్‌లో మార్పుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన పొంగులేటి
– “ఎన్డీయే పాలనే వెనుకబాటుకు కారణం”
పశ్చిమ చంపారన్ (బీహార్), నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): బీహార్ అభివృద్ధి అడ్డంకులకు కారణం రెండు దశాబ్దాల ఎన్డీయే పాలనలో కొనసాగిన అవినీతి, అవకాశవాద రాజకీయాలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పశ్చిమ చంపారన్ జిల్లా చనపటియా నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్ కృష్ణన్ అల్వర్, అభ్యర్థి అభిషేక్ రంజన్ పాల్గొన్నారు.
ఎన్డీయే భారీ హామీలతో ప్రజలను మోసగిస్తోందని అన్నారు. “ఒక కోటి ఉద్యోగాలు, ఒక కోటి మహిళలకు ఆర్థిక స్వావలంబన” వంటి వాగ్దానాలు చేస్తూ పదేపదే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. “20 ఏళ్లలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మహిళల జీవితాల్లో నిజమైన మార్పు ఎంత తీసుకువచ్చారు?” అని ప్రశ్నించారు.
ప్రజలు అవకాశం ఇస్తే బీహార్‌లో తెలంగాణ మాదిరి ప్రజల పాలన తీసుకువస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. తెలంగాణలో రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500లో గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చినట్లు గుర్తుచేశారు. బీహార్‌లో కూడా అభివృద్ధి–సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే పాలన అమలు చేస్తామని తెలిపారు.
గెలిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్డీయే ఇప్పటివరకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం వారి బలహీనతను చూపుతున్నదని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలు ఈసారి తెలివిగా నిర్ణయం తీసుకుని మార్పుకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
