రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
– రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ఉల్లంఘించిన రేవంత్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకుల బృందం బుధవారం రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదులో, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల వేళ ప్రత్యర్థి నేతలపై వ్యక్తిత్వ దూషణకు దిగడం, ప్రజల్లో ద్వేషం, ఉద్రిక్తత, పక్షపాత భావోద్వేగాలను రేపేలా మాట్లాడటం ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఉప ఎన్నికల స్వచ్ఛత, నిష్పక్షపాతత దెబ్బతినకుండా రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ జెనరల్ సెక్రటరీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్‌వి అధ్యక్షుడు గెల్లు శ్రీను తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ వర్గాలు రేవంత్ వ్యాఖ్యలపై ఎస్సీఈ (ఎలక్షన్ కమిషన్) కూడా దృష్టి సారించాలని కోరాయి.
