రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సత్యసాయి ట్రస్టు అందించే విద్యా సేవలు అద్భుతం: ఉప రాష్ట్రపతి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సత్యసాయి ట్రస్టు అందించే విద్యా సేవలు అద్భుతం: ఉప రాష్ట్రపతి

  • యంగ్ మైండ్స్ ను రూపొందించిన SSSIHLకు అభినందనలు: ఉప రాష్ట్రపతి
  • డ్రగ్స్ నివారణ జరిగేలా యువత పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి: ఉప రాష్ట్రపతి
  • సాయి సిద్ధాంతాన్ని ఉద్యమంలా తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
  • దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర: సీఎం చంద్రబాబు
  • వసుధైక కుటుంబం అనేది శాశ్వత సిద్దాంతం: సీఎం చంద్రబాబు
  • సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి


పుట్టపర్తి, నవంబర్ 22:
సత్యసాయి ట్రస్టు అందిస్తున్న విద్యా సేవలు అద్భుతంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శనివారం శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వస్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అలాగే పట్టభద్రులైన వారికి ఉప రాష్ట్రపతి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ...”శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు. 2047 నాటికి భారత దేశం నెంబర్-1 స్థానంలో ఉంటుంది. పట్టభద్రులుగా పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు ఆ అభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నారు. గత మూడు రోజుల్లో దేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్న వారు సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారు. సత్యసాయి బాబా ఎంతటి శక్తిమంతులో చెప్పడానికి ఇదే నిదర్శనం. కలలో కూడా ఊహించనంతటి గొప్ప సమాజాన్ని రూపొందించగలరనే నమ్మకం ఇక్కడున్న విద్యార్థులను చూస్తే కలుగుతోంది. ఏ యూనివర్శిటీలో కన్పించినంతటి క్రమశిక్షణ, నిబద్దత అనేది శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో కన్పిస్తున్నాయి. పట్టా పుచ్చుకున్న విద్యార్థులకు... యంగ్ మైండ్స్ ను తయారు చేసిన ఈ సంస్థకు అభినందనలు. ఉచితంగా ఇంత పెద్ద ఎత్తున విద్యను అందివ్వడం గొప్ప విషయం. ఎంత మందిని గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దామనేది ముఖ్యం కాదు... ఎంత మంది మంచి పౌరులుగా తీర్చిద్దామనే కోణంలో ఈ సంస్థను నడపడం సంతోషాన్నిస్తోంది. సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. మన కోసం మనం బతకడంతో పాటు... ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలను పాటించాలి... సంప్రదాయాలను పాటించాలి. సత్యసాయి బాబా సిద్దాంతాలు.. సూత్రాలే నిజమైన విద్య. ప్రపంచం చెప్పేది భారత దేశం వింటోందనేది పాత మాట... భారత దేశం చెప్పేది ప్రపంచం వింటోందనేది కొత్త మాట. దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమైనది. రీసెర్చ్ రంగానికి ఎక్కువ నిధులు వినియోగించాలి... అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కోవిడ్ కు టీకాలను కనుగొంది మన భారత దేశమే. దీన్ని మన దేశంతో పాటు... వివిధ దేశాలకు ఫ్రీగా ఇవ్వడమనేది నరేంద్ర మోదీ అచీవ్మెంట్. కోవిడ్ టీకాలను 100కు పైగా దేశాలకు పంపిణీ చేశారు. అందుకే ఓ దేశాధ్యక్షుడే మోదీ పాదాలకు నమస్కరించారు. భారత మాత శక్తిమంతమైనదే కాదు... దయగలిగినది కూడా. దయతో లేకుంటే... ఎంత శక్తి ఉన్నా నిరర్థకమే. కొన్ని విదేశాల్లో కూడా టీకాలు తయారు చేశారు. కానీ వారు 7500 డాలర్లకు అమ్మాలని భావించారు. ప్రధాని మోదీ ఏనాడూ కోవిడ్ టీకాలను అమ్మాలని అనుకోలేదు. అందుకే ప్రధాని మోదీ ఇవాళ గ్లోబల్ లీడర్ గా ఎదిగారు. డ్రగ్స్ ఇప్పుడు అతి పెద్ద సవాలుగా మారింది... నో టూ డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. రాజకీయాల్లోకి రావాలని లోకేష్ చెప్పినప్పుడు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీని బట్టి విద్యార్థులు భవిష్యత్ లీడర్లుగా మారతారని ఆశిస్తున్నా.”అని ఉప రాష్ట్రపతి అన్నారు.

సర్వీస్... సర్వీస్... సర్వీస్...

ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...”శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి హాజరైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. పట్టభద్రులైన గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు. భగవాన్ సత్యసాయి బాబా విశిష్టమైన విద్యా విధానానికి విద్యార్థులే ప్రతిరూపాలు. సత్యసాయి ఒక ఉద్దేశ్యంతో ఈ లోకానికి వచ్చారు. ఒక ఉద్దేశ్యం కోసమే జీవించారు. మన కోసం 'సాయి సిద్ధాంతాన్ని' ఇచ్చి వెళ్లారు. సత్యసాయి బాబా విద్యా విధానం ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజీలన్నీ సేవే. ఇప్పుడు పట్టభధ్రులు అయిన వారంతా నిస్వార్థ సేవ, కరుణ నిజాయితీ అనే విలువలను గట్టిగా ఆచరించాలి. భారతదేశం వేల సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది. "వసుధైక కుటుంబకం" అంటే "ప్రపంచమంతా ఒకే కుటుంబం" అనేది శాశ్వత సందేశం. ఇది మన సంస్కృతికి గుండెకాయ వంటిది. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థ విద్యాభ్యాసంతో పాటు నీతి, విలువలను కూడా మిళితం చేస్తుంది. Science, Technology, Arts వంటి రంగాల్లో నైపుణ్యంతో పాటు, సామాజికంగా ఉపయోగపడే పరిశోధనలపై ఇక్కడ బలమైన ప్రాధాన్యత ఉంది. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థ యువ మేధావులను తీర్చిద్దింది. 21వ శతాబ్దం భారతదేశానిది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 1990ల మధ్యలో సాంకేతిక పురోగతి అనేది ప్రారంభమైంది. ఇది హైదరాబాద్‌తో సహా అనేక నగరాలను ప్రపంచ ఐటీ హబ్‌లుగా మార్చింది. భారతదేశానికి అధిక జనాభా వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉంది. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశం 10వ స్థానం నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం. దీనిని సాధించడానికి మనం భవిష్యత్తు రంగాలు అయిన AI-డేటా సెంటర్లు, క్వాంటం, ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్షం, సెమీకండక్టర్, రక్షణ రంగాలలోని పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నాం. దేశంలో ఉన్న అన్ని ఫ్యూచర్ టెక్నాలజీలను ఏపీకి తెస్తున్నాం. సీఐఐ సదస్సులో రూ. 13.25 లక్షల పెట్టుబడులు తెచ్చాం... 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుంది. వినూత్న ఆలోచనలకు ఆర్టీఐహెచ్ వేదిక. కొత్త ఆలోచనలతో వచ్చిన వారితో కంపెనీలు పెట్టించేలా చూస్తున్నాం. ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూర్, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఏఐ టెక్నిషీయన్ అనే సిద్దాంతంతో పని చేస్తున్నాం. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నాం. నైపుణ్యమున్న యువతదే అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర. విద్యార్థులు, యువతే దేశానికి సంరక్షకులు. సాయి సిద్ధాంతంలో అమలు చేస్తూనే, సాంకేతికత, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా సంక్షేమానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయండి. బాబా ప్రపంచంలోని నలుమూలలా ఉన్న కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు. సాయి సిద్ధాంతాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. సాయి బాబా స్పూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యపీ సొసైటీని రూపొందించేలా కృషి చేయాలి. కోయంబత్తూరు గాంధీగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు పేరుంది. నిత్యం ప్రజలకు సేవ చేయాలని తపన పడుతూ ఉంటారు. ప్రస్తుతం సత్యసాయి జయంత్యుత్సవాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో సహ రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారంతా వచ్చారు. సత్యసాయి బాబా గొప్పదనం ఇది.”అని ముఖ్యమంత్రి వివరించారు. అంతకు ముందు పుట్టపర్తికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యకుమార్, సవిత, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

Comments

-Advertisement-