Cyber crimes: డిజిటల్ అరెస్టుపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు
Cyber crimes: డిజిటల్ అరెస్టుపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టు పేరుతో బాధితులు సుమారు మూడు వేల కోట్లు కోల్పోవడం షాకింగ్‌గా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుల్లో కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు తమను భద్రతా సిబ్బందిగా, కోర్టు అధికారులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని బాధితులను బెదిరిస్తున్నారని తెలిపింది. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా బాధితులను భయబ్రాంతులకు గురి చేసి, బలవంతంగా డబ్బులు చెల్లించేలా ఒత్తిడి తెస్తున్నారని కోర్టు పేర్కొంది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు ఉజ్వల్ భుయాన్, జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులపై విచారణ చేపట్టింది. ఈ అంశంపై సూచనలు అందించేందుకు అమికస్ క్యూరీని నియమించింది. కేంద్ర హోంశాఖ, సీబీఐ సమర్పించిన నివేదికలను కోర్టు పరిశీలించింది.
డిజిటల్ అరెస్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం అత్యంత ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. బాధితుల్లో వృద్ధులు కూడా ఉన్నారని, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన ఆదేశాలు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తెలిపింది.
భద్రతా సంస్థలను న్యాయ ఆదేశాల ద్వారా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని కోర్టు సూచించింది. ఈ కేసులపై నవంబర్ 10న మళ్లీ విచారణ జరగనుంది.
సీబీఐ సమర్పించిన నివేదికలో నేరగాళ్లు విదేశీ ప్రాంతాల నుండి ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నట్టు జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. కేంద్రం, సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హోంశాఖకు చెందిన సైబర్ విభాగం ఈ కేసులను చూసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
హర్యానాకు చెందిన ఒక వృద్ధ మహిళ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తప్పుడు కోర్టు ఆదేశాలు చూపిస్తూ నేరగాళ్లు ఆమెను మోసం చేశారని, కోటికిపైగా మొత్తాన్ని లాక్కున్నారని ఆమె పేర్కొంది. సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి ఆడియో, వీడియో కాల్స్ ద్వారా బెదిరించారని తెలిపింది. ఈ ఘటనపై అంబాలాలో రెండు కేసులు నమోదు అయ్యాయి.
