రెండో రోజు ఉద్భవ్-2025లో మెరిసిన గిరిజన చిన్నారులు
రెండో రోజు ఉద్భవ్-2025లో మెరిసిన గిరిజన చిన్నారులు
- క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీలలో విద్యార్థుల ప్రతిభ
- 49 ఈవెంట్లలో ఇప్పటివరకు 29 ఈవెంట్లు పూర్తి
- తొలి రోజు పతకాలలో త్రిపుర, సిక్కిం, ఏపీ,ఒడిశా రాష్ట్రాల హవా
- శుక్రవారం తేలనున్న అన్ని విభాగాల తుది ఫలితాలు
- శాస్త్రీయ సంగీతం, ఆశుకవిత్వం విభాగాలలో ఏపీకి పసిడి
- దేశభక్తి గ్రూప్ సాంగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం
- 22 పతకాలతో ఒడిషాకు తొలి స్థానం, 20 పతకాలతో తెలంగాణ రెండో స్థానం
- మొత్తం 11 పతకాలు సాధించి ఐదో స్థానంలో ఉన్న ఆతిథ్య ఆంధ్రప్రదేశ్
అమరావతి, డిసెంబర్, 04; గిరిజన విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికితీయడమే ఉద్దేశంగా నిర్వహిస్తోన్న ఉద్భవ్-2025 సాంస్కృతిక ఉత్సవాలలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. కేఎల్ యూనివర్శిటీ వద్ద చిన్నారులు ప్రదర్శించే కళలతో సందడి వాతావరణం నెలకొంది.తొలి రోజు నిర్వహించిన పోటీల ఫలితాలలో త్రిపుర, సిక్కిం, ఏపీ,ఒడిశా రాష్ట్రాల హవా సాగింది. రెండో రోజు నిర్వహించిన క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీలలో విద్యార్థులు మెరిశారు. రెండో రోజు మొత్తం 22 విభాగాలలో ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 4.30 గం.ల వరకు పోటీలు నిర్వహించారు. ఇప్పటికే పలు విభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడించారు. రేపటితో అన్ని విభాగాలకు తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన వేదిక కృష్ణ జింక వద్ద జరుగుతున్న డ్రామా పోటీలను వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. జాస్మిన్ హాల్ వద్ద జరుగుతున్న శాస్త్రీయ సంగీత, నృత్య పోటీల వద్ద పండగ వాతావరణం నెలకొంది.
11 పతకాలతో ఐదవస్థానంలో ఆంధ్రప్రదేశ్
ఉద్భవ్-2025 ఉత్సవాలలో తొలి రెండు రోజులు కలిపి మొత్తం 46 ఈవెంట్లలో ఇప్పటివరకు 29 ఈవెంట్లు పూర్తయ్యాయి. అత్యధికంగా 22 పతకాలు సాధించి ఒడిషా రాష్ట్రం తొలి స్థానంలో సాధించింది. తెలంగాణ రాష్ట్రం 20 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 16 పతకాలతో సిక్కిం 16, 13 పతకాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. 11 పతకాలతో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానాలలో నిలిచాయి. అయితే , శాస్త్రీయ సంగీతం, ఆశుకవిత్వం విభాగాలలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పసిడి పతకం దక్కింది. దేశభక్తి గ్రూప్ సాంగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఆశుకవిత్వం ఇంగ్లీష్ సీనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు మూడో స్థానం దక్కింది.
శుక్రవారం ఉద్భవ్-2025 ముగింపు
ప్రాంతీయ జానపద బృంద నృత్యం, దేశభక్తి బృందగానం, గిరిజన సంప్రదాయ నృత్యం, కథ చెప్పడం, సృజన రచన, చిత్రలేఖనం వంటి పోటీలలో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు. డ్రాయింగ్, పెయింటింగ్, కార్టూన్, విజువల్ ఆర్ట్స్, స్థానిక హస్తకళల విభాగం ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. చివరిరోజున తొమ్మిది విభాగాలకు పోటీలు జరగనున్నాయి. రీజనల్ ట్రైబల్ డాన్స్, కర్ణాటక సంగీత గానం, వాయిద్యం, జానపద సంగీతం, నాటిక, ఆర్కెస్ట్రా వంటి విభాగాలకు ఆఖరి రోజున పోటీలు జరగనున్నాయి. అనంతరం అన్ని విభాగాలకు సంబంధించిన తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

