నియోజక వర్గం సమగ్రాభివృద్ధి... ప్రజా సంక్షేమం సంతృప్త స్థాయిలో ఉండాలి
నియోజక వర్గం సమగ్రాభివృద్ధి... ప్రజా సంక్షేమం సంతృప్త స్థాయిలో ఉండాలి
• కూటమి ధర్మాన్ని అనుసరిస్తూ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాలి
• పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
• జనసేన ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు ప్రారంభం
ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించటంలో ఏ దశలోనూ రాజీపడకూడదని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సంతృప్త స్థాయిలో ఉండేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించాలని నిర్ణయించారు. సాయంత్రం మంగళగిరిలోని తన కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో ఈ సమావేశాలు ప్రారంభించారు.
ఏడాదిన్నర కాలంలో పోలవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీరాజ్ నిధుల వినియోగం, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. పనుల పురోగతితోపాటు ప్రభుత్వ పథకాల అమలు తీరు, వ్యవసాయ సంబంధిత అంశాలు, యువత ఉపాధి అవకాశాలపై సమీక్షించారు. పెండింగ్ పనుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచి కూటమిని గెలిపించారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా పని చేయాలి. పోలవరం గిరిజన ప్రాంతాలు, ముంపు మండలాలతో కూడిన నియోజక వర్గం. అక్కడి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుంది. ఇటీవల ఐ.ఎస్.జగన్నాథపురం పర్యటనకు వెళ్ళినప్పుడు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం నుంచి ఒక ఆడపడుచు పసి బిడ్డను ఎత్తుకొని వచ్చింది. ఆమె విజ్ఞప్తి ఒకటే- తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించమని. ఆమె విజ్ఞప్తిని తక్షణమే పరిశీలించి తిమ్మనకుంట – గవరవరం మధ్య రెండు రోడ్లు నిర్మాణానికి రూ.7 కోట్ల 60 లక్షలు మంజూరు చేయించాను. అక్కడ రోడ్డు దెబ్బ తినడంతో రెండు దశాబ్దాల నుంచి ఇబ్బందిపడుతున్నారు. తన బిడ్డను ఎత్తుకొని వచ్చిన మహిళ విజ్ఞాపన ఇచ్చి రోడ్డు సాధించుకున్నారు. అలాంటి సమస్యలను ఎమ్మెల్యేగా గుర్తించి పరిష్కారం చేసే విధంగా పని చేయాలి.
ప్రజలు సంక్షేమం గురించే కాదు తమ ప్రాంత అభివృద్ధి గురించీ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. పోలవరం నియోజక వర్గంలోని రైతులు, మహిళలు, యువత.. ఇలా ప్రతి వర్గానికీ అందుబాటులో ఉంటూ సమస్యల సత్వర పరిష్కారం కోసం పని చేస్తేనే ప్రజలలో సంతృప్త స్థాయి పెరుగుతుంది. అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి.
అదే సమయంలో కూటమి ధర్మాన్ని అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో వేగవంతం చేయాలి. జనసేన శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలి” అన్నారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో జనసేన శ్రేణులకు దక్కిన నామినేటెడ్ పోస్టుల వివరాలపై చర్చించారు.
• అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాలను ఉప ముఖ్యమంత్రివర్యులకు అందించారు. కొయ్యలగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు, సి.హెచ్.సి. అభివృద్ది, ఫైర్ స్టేషన్ ఏర్పాటు, టి.నరసాపురం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. పనులకు నిధుల పెంపు, నియోజవర్గంలో సి.సి.రోడ్లు, రహదారుల నిర్మాణాలపై ప్రతిపాదనలు అందించారు. ఈ పనుల అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు.
