ఇది కదా మైండ్ బోయింగ్ ఆఫర్ అంటే..
ఇది కదా మైండ్ బోయింగ్ ఆఫర్ అంటే..
- రూ. 8 లక్షల కారు కొంటే జీవితకాలం బ్యాటరీ ఉచితం..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే తక్కువ నిర్వహణ ఖర్చులు, ఇంధన పొదుపు కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సంచలన ఆఫర్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఖర్చే మొత్తం ధరలో దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలు 8 నుంచి 10 సంవత్సరాలు లేదా సుమారు 2 లక్షల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ భయాన్ని తొలగించేలా టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రూ. 8 లక్షల ధర శ్రేణిలో లభించే టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మోడళ్లకు జీవితకాల బ్యాటరీ వారంటీ ఇవ్వాలని కంపెనీ యోచిస్తోంది. జీవితకాల వారంటీ అంటే దేశీయ నిబంధనల ప్రకారం మొదటి యజమానికి 15 సంవత్సరాల వరకు అపరిమిత కిలోమీటర్ల కవరేజీ కల్పించడంగా భావిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో బ్యాటరీ మార్పు ఖర్చు గురించి వినియోగదారులకు ఎలాంటి ఆందోళన ఉండదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన మూడో త్రైమాసికంలో 1,71,013 వాహనాలను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 22 శాతం వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తే ఈ వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు.
ఈ జీవితకాల బ్యాటరీ ఆఫర్ అధికారికంగా ప్రకటిస్తే, దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఇది గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముందని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల దృష్టిలో ఎలక్ట్రిక్ కార్లపై ఉన్న అనుమానాలకు ఇది పూర్తి స్థాయిలో చెక్ పెట్టే నిర్ణయంగా భావిస్తున్నారు.
