కేవలం మ్యాచులు ఆడటం మాత్రమే మా పని.
కేవలం మ్యాచులు ఆడటం మాత్రమే మా పని..
- బంగ్లా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్–భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లా క్రికెటర్ మహేదీ హసన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన తర్వాత ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరడం, దీనిపై రోజుకో అంశం వెలుగులోకి రావడం చర్చకు దారి తీస్తోంది.
ఈ పరిస్థితులపై స్పందించిన మహేదీ హసన్ మాట్లాడుతూ, వివాదాల గురించి ఆటగాళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఈ అంశాలన్నీ జట్టు మేనేజ్‌మెంట్, అధికారులు చూసుకుంటారని, క్రికెటర్ల పని కేవలం మ్యాచ్‌లు ఆడటమేనని వ్యాఖ్యానించాడు. అవసరమైతే ఆటగాళ్లను ఎక్కడికి పంపినా వెళ్లి ఆడాల్సిందేనని, ఈ విషయంలో ఇతర ఆటగాళ్లకు సందేహాలు ఉండవని తాను భావిస్తున్నానని చెప్పాడు.
ఇదిలా ఉండగా, గత టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించిన నజ్ముల్ హుస్సేన్ శాంటో కూడా ప్రస్తుత పరిస్థితులపై స్పందించాడు. ప్రతి ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, ఇవి ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయని అన్నాడు. అయినప్పటికీ ఆటగాళ్లు ఈ అంశాలను పక్కన పెట్టి జట్టు కోసం మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమస్యలు లేకపోతే మంచిదేనని, అయితే ఇవి ఆటగాళ్ల చేతిలో లేవని ఆయన పేర్కొన్నారు.
