ఈ–క్రాప్ నమోదు లోపాలు లేకుండా చేపట్టాలి
ఈ–క్రాప్ నమోదు లోపాలు లేకుండా చేపట్టాలి
-జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు, జనవరి 30 (పీపుల్స్ మోటివేషన్):-
రైతుల పంటలకు భద్రత కల్పించే కీలకమైన ఈ క్రాప్ నమోదు ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఓర్వకల్లు మండల కేంద్రంలో వరి పంట సాగు చేస్తున్న రైతుల పొలాల్లో ఈ–క్రాప్ నమోదును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, రుణ మాఫీ, నష్టపరిహారం వంటి ప్రయోజనాలు రైతులకు అందాలంటే ఈ–క్రాప్ డేటా ఖచ్చితంగా నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేసి పంట రకం, సాగు విస్తీర్ణం, సాగు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. ఈ క్రాప్ నమోదు సమయంలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలని ఆదేశించారు. రైతులు కూడా తమ పంట వివరాలు సరిగా నమోదు అయ్యాయా లేదో పరిశీలించుకుని, లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, ఆర్డీవో సందీప్, ఓర్వకల్లు మండల వ్యవసాయ అధికారి మధుమతి, గ్రామ వ్యవసాయాధికారి ఉసేన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
