ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అభిషేక్ శర్మదే..!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అభిషేక్ శర్మదే..!
ముంబై – 04 ఫిబ్రవరి 2026 – పీపుల్స్ మోటివేషన్
పొట్టి ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈసారి కూడా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విఫలమైనప్పటికీ మొత్తం 917 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.
ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 834 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 769 పాయింట్లతో ఉన్నాడు. భారత ఆటగాళ్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకోవడం భారత అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే విషయం.
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి పడిపోయాడు. గత నెలలో శస్త్రచికిత్స కారణంగా జట్టుకు దూరమైన తిలక్ వర్మ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో భారత్ ‘ఏ’ జట్టు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ప్రధాన జట్టుతో కలవనున్నాడు.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల మంచి ఫామ్‌లోకి వచ్చిన సూర్య ఆరో స్థానానికి చేరుకుని 728 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో సెంచరీ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ర్యాంకింగ్స్‌లో భారీగా ఎగబాకాడు. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకోవడం విశేషం. ప్రపంచ కప్ గ్రూప్ దశలో భారత తుది జట్టులో చోటు దక్కితే, రాబోయే రోజుల్లో ఇషాన్ టాప్ 10లోకి చేరే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
