టీ20 వరల్డ్ కప్‌లో ఉన్న జట్లన్నీ ప్రమాదకరమే..
టీ20 వరల్డ్ కప్‌లో ఉన్న జట్లన్నీ ప్రమాదకరమే..
- కానీ భారత్ మరింత డేంజరస్..!: ధోనీ
ముంబై – 04 ఫిబ్రవరి 2026 – పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచకప్ 2026 ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా జరుగనున్న ఈ పొట్టి ప్రపంచకప్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు ప్రమాదకరంగానే ఉన్నాయని, కానీ వాటన్నింటిలోకీ భారత్ మరింత డేంజరస్ జట్టుగా కనిపిస్తోందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు.
పొట్టి ఫార్మాట్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అయితే భారత జట్టులోని ఆటగాళ్లకు ఒత్తిడిలో ఆడిన అనుభవం పుష్కలంగా ఉందని ధోనీ వివరించాడు. ఎవరు ఏ పాత్ర పోషించాలో టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉందని పేర్కొన్నాడు. ఒక మంచి జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ భారత జట్టులో ఉన్నాయని ధోనీ తెలిపాడు.
మ్యాచ్‌లు జరగనున్న వేదికల వాతావరణ పరిస్థితులు తనను కొంత కలవరపరుస్తున్నాయని ధోనీ అన్నాడు. శీతాకాలం కారణంగా కొన్ని నగరాల్లో మంచు పడుతుండటం వల్ల మైదానాల్లో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. డ్యూ మ్యాచ్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేసే అంశమని, తాను ఆడిన రోజుల్లో కూడా డ్యూ అంటే జట్లకు పెద్ద సవాలుగా ఉండేదని గుర్తుచేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని ధోనీ వ్యాఖ్యానించాడు
