అమరావతి ట్రంక్ రోడ్లు 2027 నాటికి పూర్తి లక్ష్యం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అమరావతి ట్రంక్ రోడ్లు 2027 నాటికి పూర్తి లక్ష్యం
- ఇన్నర్ రింగ్ రోడ్ రెండు దశల్లో నిర్మాణం
- రూ. 40,847 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
- వ్యవసాయ కనెక్షన్లు, ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వ ప్రకటన
అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): రాజధాని అమరావతిలో ప్రధాన ట్రంక్ రోడ్ల నిర్మాణాన్ని 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్ 96.2 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో 8+4 వరుసల రహదారిగా రూపకల్పన చేశామని చెప్పారు.
ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అమలవుతుందని మంత్రి వివరించారు. మొదటి దశలో కేతనకొండ నుంచి నున్న వరకు, రెండో దశలో నున్న నుంచి కేతనకొండ వరకు నిర్మాణం చేపడతామని తెలిపారు. భూ సమీకరణ పూర్తయ్యాక అభివృద్ధి పనులకు కనీసం 24 నుంచి 30 నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. తొలి దశలో 67.6 కిలోమీటర్ల మేర నిర్మాణం గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మొత్తం 26 గ్రామాల మీదుగా సాగుతుందని వెల్లడించారు. డీపీఆర్ సిద్ధమైందని, భూ సమీకరణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. రాజధాని ట్రంక్ రోడ్ల మౌలిక సదుపాయాల కోసం ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్ తదితర సంస్థల ద్వారా రూ. 40,847 కోట్లు సమకూర్చామని మంత్రి తెలిపారు. ఈ నిధులతో సమగ్ర రహదారి వలయం నిర్మించి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు విద్యుత్ సంస్థల పరిధిలో 1,02,538 కొత్త కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల కనెక్షన్లను వ్యవసాయ సీజన్‌కు ముందే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం రూ. 839.44 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద 2,61,481 కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఫీడర్ స్థాయి సౌర ప్రాజెక్టుల ద్వారా రూ. 1,059 కోట్లు ఆదా అవుతుందని వెల్లడించారు. ఏప్రిల్ నుంచి నేయర్లకు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్‌మెన్ పోస్టుల ఖాళీలపై కూడా మంత్రి స్పందించారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్‌మెన్ 1260, అసిస్టెంట్ లైన్‌మెన్ 1084, లైన్‌మెన్ 22 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీల భర్తీ చేపడతామని వెల్లడించారు. లోడ్ ఆధారంగా విద్యుత్ ఉపకేంద్రాల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
Comments
