టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం..
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం..
- టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్..!
ముంబై – ఫిబ్రవరి 07 – పీపుల్స్ మోటివేషన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టైటిల్ వేటకు సిద్ధమవుతున్న భారత జట్టుకు టోర్నీ ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న బుమ్రా నిన్న జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైనప్పటికీ, బౌలింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదని సమాచారం. దీంతో తొలి మ్యాచ్‌లో అతడి లభ్యతపై జట్టు మేనేజ్‌మెంట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. కీలక మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్ దూరమైతే భారత బౌలింగ్ విభాగానికి ఇది పెద్ద లోటేనని విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే యువ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ నెల 04న దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా తీవ్ర నొప్పితో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత నిర్వహించిన స్కాన్లు, నిపుణుల పరీక్షల్లో అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో, ప్రపంచకప్‌లో పాల్గొనడం సాధ్యం కాదని బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించగా, అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
బుమ్రా ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతుండటంతో, తొలి మ్యాచ్‌లో సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన సిరాజ్‌కు, ఇప్పుడు బుమ్రా అందుబాటులో లేకపోతే మరింత కీలక బాధ్యతలు పడనున్నాయి. అంతేకాదు, భారత పేస్ దళానికి నాయకుడిగా బుమ్రా లేకపోవడం వల్ల డెత్ ఓవర్లలో బౌలింగ్ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పైనా ఇంకా స్పష్టత రాలేదు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తేనే జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తొలి మ్యాచ్ నాటికి భారత జట్టుకు పూర్తిగా ఫిట్‌గా ఉన్న ఆటగాళ్ల సంఖ్య పరిమితంగా ఉండటం గమనార్హం.
మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియాకు కీలక ఆటగాళ్ల గాయాలు, అనారోగ్య సమస్యలు ఆరంభంలోనే పెద్ద సవాలుగా మారాయి. తొలి మ్యాచ్‌లో బుమ్రా ఆడుతాడా? లేదంటే సిరాజ్‌తో పాటు ఇతర పేసర్లు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు? అన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
