జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం: తల్లి ఆవేదన
జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం: తల్లి ఆవేదన
- పరిహారంపై ప్రశ్నించిన తల్లి విజయలక్ష్మి
- సియాటెల్‌లో జరిగిన ప్రమాదంపై అంతర్జాతీయ చర్చ
- పోలీసు అధికారిపై విమర్శలు, న్యాయం కోసం కుటుంబ పోరాటం
ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం ప్రకటించిన నేపథ్యంలో ఆమె తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలని ప్రశ్నిస్తూ, తన కుమార్తె ప్రాణానికి న్యాయం జరగాలనే ఆవశ్యకతను ఆమె ప్రస్తావించారు. యాక్సిడెంట్‌కు కారణమైన అధికారికి శిక్ష పడదని, జాహ్నవి మరణాన్ని ఎగతాళి చేసిన మరో అధికారి సంగతేంటని ఆమె మీడియా ముందు ప్రశ్నించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి అమెరికాలోని సియాటెల్లో చదువుకుంటుండగా 2021 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. నిర్ణయించిన వేగం కంటే మూడింతలు ఎక్కువగా, సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపిన కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి ఆమెను ఢీకొట్టడంతో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం సమయంలో జరిగిన సంభాషణలు బాడీ కెమెరాలో రికార్డై బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది.
జాహ్నవి మరణాన్ని ఎగతాళి చేస్తూ ఆమె ప్రాణానికి విలువ లేదని వ్యాఖ్యానించిన పోలీసు అధికారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారత్‌తో పాటు అమెరికా సహా అనేక దేశాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ అనంతరం సియాటెల్ సిటీ ప్రభుత్వం కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించింది. పరిహారం ప్రకటన సందర్భంగా సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ జాహ్నవి మరణం బాధాకరమని, ఈ ఆర్థిక సహాయం కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జాహ్నవి తండ్రి శ్రీకాంత్ పరిహారం ప్రకటనకు రెండు రోజుల ముందే గుండెపోటుతో మృతి చెందడం కుటుంబానికి మరింత దురదృష్టాన్ని మిగిల్చింది. కూతురు మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఇటీవలే విధుల్లో చేరి విధులకు హాజరుకావడానికి వెళ్తుండగా కన్నుమూశారు. ఇప్పుడు పరిహారం ప్రకటించినప్పటికీ, తమకు కావలసింది న్యాయమని, కుమార్తె ప్రాణానికి విలువ చెల్లించాల్సిన వారు బాధ్యత వహించాలనే డిమాండ్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
