ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మండలిలో రచ్చ
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మండలిలో రచ్చ
- ప్రభుత్వం అసత్యాలు మాట్లాడుతోందని బొత్స ఆరోపణ
- రూ.8,500 కోట్ల బకాయిలు ఉన్నాయని వైసీపీ వాదన
- రూ.1,859 కోట్లు చెల్లించామని మంత్రుల కౌంటర్
అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం అసత్యాలు మాట్లాడుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమకు వాకౌట్ చేయడం ఫ్యాషన్ కాదని, అయినా సరే ప్రభుత్వం వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు దిగుతున్నామని పేర్కొన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ మొత్తం రూ.8,500 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం రూ.700 కోట్లు మాత్రమే చెల్లించిందని, ఇంకా రూ.7,800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించామని, ప్రస్తుత ప్రభుత్వం ఎనిమిది విడతలుగా బకాయిలు పెండింగ్‌లో ఉంచిందని విమర్శించారు.
దీనికి స్పందించిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, వైసీపీ సభ్యులు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు రూ.1,859 కోట్లు చెల్లించామని, ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బకాయిలు పూర్తిగా క్లియర్ చేశామని వివరించారు. కాలేజీలకు ఇప్పటికే చెల్లింపులు చేసిన విద్యార్థుల ఖాతాల్లోకి నగదు జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రూ.4,064.59 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని రికార్డుల ఆధారంగా స్పష్టం చేశారు. అన్ని వివరాలను సభ ముందు ఉంచుతామని తెలిపారు. బొత్స సత్యనారాయణ మాత్రం గత ప్రభుత్వం రూ.4,000 కోట్లు బకాయిలు పెట్టిందని చెప్పడం అసత్యమని, ఎన్నికల కోడ్ కారణంగా ఒక్క క్వార్టర్ మాత్రమే పెండింగ్ అయిందని వాదించారు. బకాయిలు ఎప్పటికి పూర్తిగా చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
