సూపర్-8 ఫార్మాట్ విషయంలో ఐసీసీపై విమర్శలు
సూపర్-8 ఫార్మాట్ విషయంలో ఐసీసీపై విమర్శలు
హైదరాబాద్ – ఫిబ్రవరి 20 – పీపుల్స్ మోటివేషన్
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 ఫార్మాట్‌పై క్రీడా వర్గాల్లో విపరీతమైన చర్చ కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం కారణంగా గ్రూప్ స్టేజ్‌లో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన టాపర్ జట్లకు అన్యాయం జరుగుతుందని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఏ టోర్నీలోనైనా గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత టాప్‌లో నిలిచిన జట్లకు తదుపరి రౌండ్లో కాస్త ఉపశమనం ఇచ్చేలా సీడింగ్ విధానం ఉంటుంది. కానీ ఈసారి ఐసీసీ టోర్నీ ప్రారంభం కాకముందే ఏ టీమ్ ఏ గ్రూపులో ఉండాలో ఫిక్స్ చేసేసింది. టోర్నీ ప్రారంభం కాకముందే సీడింగ్ వేయడం ప్రీ-సీడింగ్(pre-seeding) అని పిలవబడుతుంది. దీని అర్థం ఏదంటే ఒక జట్టు తన గ్రూపులో మొదటి లేదా రెండో స్థానంలో నిలిచినా ముందుగా నిర్ణయించిన స్లాట్‌లోనే ఉంటుంది. ఈ విధానం కారణంగా గ్రూప్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు ఒకే గ్రూపులో ఉండడం వల్ల రెండు జట్లు సెమీస్‌కు చేరకపోవాల్సి వస్తోంది. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ చేరడం సులభమవుతుంది. దీనివల్ల టాపర్లుగా నిలిచిన జట్లకు అన్యాయం జరిగిందని, ప్రతిభను గౌరవించేలా లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ స్పందనలో, భారత్, శ్రీలంక సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నందున రవాణా, భద్రత, బ్రాడ్‌కాస్టింగ్ షెడ్యూల్‌లకు ముందుగానే ప్లాన్ చేసుకోవడం కోసం ప్రీ-సీడింగ్ విధానం తీసుకున్నామని, అభిమానులు, మీడియా కోసం సౌకర్యాన్ని కల్పించడమే ఉద్దేశమని తెలిపింది.
