‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’తో జనసేన మూడో విడత సభ్యత్వం ప్రారంభం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’తో జనసేన మూడో విడత సభ్యత్వం ప్రారంభం
- పలు రాష్ట్రాలకు విస్తరణ లక్ష్యం
- సభ్యత్వ రుసుము తగ్గింపు, భారీ బీమా భరోసా
- ఉద్యమి–సాధక్–ప్రదాత వర్గీకరణతో క్రమశిక్షణ
అమరావతి, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్): రాజకీయాల్లో సరికొత్త మార్పు లక్ష్యంగా పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయాలనే ఉద్దేశంతో ‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’ నినాదంతో జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గానికే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా, అలాగే ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని అధిష్ఠానం నిర్ణయించింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ పార్టీ ఉనికిని చాటుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీ స్థాయిలో సభ్యులను చేర్చుకోవడం ద్వారా కేడర్ బలాన్ని ప్రదర్శించాలని పవన్ కల్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. సామాన్యులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వ రుసుమును 500 రూపాయల నుంచి 400 రూపాయలకు తగ్గించారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా, ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం కలిగితే రెండు లక్షల రూపాయలు, గాయాలయితే యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా పథకాన్ని రూపొందించారు. సభ్యత్వ రుసుమును పూర్తిగా కార్యకర్తల సంక్షేమం కోసమే వినియోగిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ నిర్మాణంలో క్రమశిక్షణ పెంచేందుకు సభ్యత్వాన్ని ఉద్యమి, సాధక్, ప్రదాత అనే మూడు వర్గాలుగా విభజించారు. కార్యకర్తల పనితీరు, నిబద్ధత ఆధారంగా ఈ వర్గీకరణ అమలులోకి రానుంది. గత రెండు విడతల్లో 13 లక్షలకు పైగా సభ్యులను నమోదు చేసుకున్న జనసేన, ఈ మూడో విడతలో రికార్డు స్థాయి సభ్యత్వం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సిద్ధాంతాల ప్రచారం, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే ప్రధాన ధ్యేయంగా ఈ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతోంది.
Comments
